సాగుకు విత్తనాలు రెడీ.. | - | Sakshi
Sakshi News home page

సాగుకు విత్తనాలు రెడీ..

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

● వరిలో ఐదు రకాలు, 7వేల క్వింటాళ్లు ● అందుబాటులో పెసర, మినుము విత్తనాలు కూడా.. ● పీఏసీఎస్‌లు, ఆగ్రోస్‌ ద్వారా విక్రయానికి ఏర్పాట్లు సాగుకు అనుగుణంగా విత్తనాలు

● వరిలో ఐదు రకాలు, 7వేల క్వింటాళ్లు ● అందుబాటులో పెసర, మినుము విత్తనాలు కూడా.. ● పీఏసీఎస్‌లు, ఆగ్రోస్‌ ద్వారా విక్రయానికి ఏర్పాట్లు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇండెంట్ల ఆధారంగా విత్తనాలను సమకూరుస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తన విక్రయాలు మొదలయ్యాయి. వరి, పెసర, మినుము విత్తనాలు కూడా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

– బయ్య రఘు, ప్రాంతీయ మేనేజర్‌, విత్తనాభివృద్ధి సంస్థ

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్‌ మొదలుకావడంతో విత్తనాభివృద్ధి సంస్థ వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి జిల్లాలోని వనరులు, నేలల రకాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖల నుంచి అందిన ఇండెంట్ల ఆధారంగా విత్తనాలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో వరి ప్రధాన పంట కావడంతో ఐదు రకాల విత్తనాలు సమకూర్చనుండగా, మెట్ట పైర్లుగా సాగు చేసే పెసర, మినుము విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాల విక్రయాలు ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలు, ఆగ్రోస్‌ రైతు కేంద్రాల ద్వారా జరుగుతున్నాయి.

సన్న రకాలు

ప్రభుత్వం వరిలో సన్న రకాల సాగును ప్రోత్సహిస్తోంది. దీంతో మూడు రకాలను విత్తనాభివృద్ధి సంస్థ విక్రయానికి సిద్ధం చేసింది. ఇందులో బీపీటీ– 5204 రకం మూడు వేల క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌–15048 కేఎన్‌ఎం–1638 రకాలు రెండేసి వేల క్వింటాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కాక దొడ్డు రకాల్లో ఎంటీయూ–1010, కేఎన్‌ఎం–118 రకాలను 500 క్వింటాళ్లు చొప్పున సిద్ధం చేశారు.

మెట్ట పంటలకు సైతం..

ఉమ్మడి జిల్లాలో మెట్ట పంటలుగా వర్షాధారం ఆధారంగా పెసర, మినుము సాగు చేస్తారు. అంతేగాక వరి మాగాణి భూముల్లో ముందస్తు పంటగా కొందరు రైతులు పెసర సాగు చేసి పరిస్థితులకు అనుగుణంగా పచ్చిరొట్టగా వినియోగిస్తారు. మిర్చి వంటి పంటల సాగుకు ముందు కూడా భూసారం పెంచేందుకు పెసర వేస్తారు. తద్వారా రైతులకు ఆదాయం లభించడమే కాక పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది. పెసరలో మధిర రకాలు ఎంజీజీ–295 రకం 500 క్వింటాళ్లు, ఎంజీజీ–385 రకం 800 క్వింటాళ్లు అందుబాటులో ఉండగా, మినుములో పీయూ–31 రకం 200 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ విత్తనాలను సహకార సంఘాలు, ఆగ్రోస్‌ రైతు విక్రయ కేంద్రాల ద్వారా విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement