ఖమ్మంమయూరిసెంటర్/తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తిరుమలాయపాలెంలో 0.8 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12–30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు రామ్‌లీల ఫంక్షన్‌హాల్‌లో ఖమ్మం రూరల్ మండల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆతర్వాత నేలకొండపల్లి మండలం బైరవునిపల్లిలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి, బుద్దారం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
4లక్షల
పోస్టల్ ఖాతాలే లక్ష్యం
నేలకొండపల్లి: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 4లక్షల పోస్టల్ ఖాతాలు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించినట్లు శాఖ ఖమ్మం డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసులను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది 2.30లక్షల నూతన ఖాతాలను ప్రారంభించగా, ఈ ఏడాది 4లక్షల లక్ష్యంలో ఇప్పటికే 30 వేల ఖాతాలను తెరిపించామని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, శాఖలో ఖాళీల భర్తీకి వచ్చే నెల నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సౌత్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, బీఎం రమేష్, బీపీఎంలు పాల్గొన్నారు.
బీఎల్‌ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలి
వైరా/ఏన్కూరు: ఓటర్ల జాబితా మ్యాపింగ్ నేపథ్యాన బీఎల్‌ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా కేవీకేలో గురువారం వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాల బీఎల్‌ఓల సమావేశం ఏర్పాటుచేశారు. అలాగే, ఏన్కూరు రైతువేదికలో జూలూరుపాడు, ఏన్కూరు మండలాల బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించగా ఆమె మాట్లాడారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు ఓటరు జాబితా మ్యాపింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వయస్సుల వారీగా విభజించుకుని అర్హులెవరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడాలని తెలిపారు. ఇదేసమయాన అనర్హుల పేర్లు గుర్తించాలని సూచించారు. అవసరమైతే బీఎల్‌ఓలు సహాయకులను నియమించుకోవచ్చని చెప్పారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈసమావేశాల్లో తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
గురుకులాలు, హాస్టళ్లను సిద్ధం చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: కొత్త విద్యాసంవత్సరం 15వ తేదీన మొదలుకానున్న నేపథ్యాన గురుకులాలు, వసతిగృహాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎం.డీ.ముజాహిద్ సూచించారు. ఖమ్మంలోని కార్యాలయంలో గురువారం ఆయన గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. గురుకులాల్లో అవమరమైన మరమత్తులను తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా వరద ప్రభావిత పాఠశాలల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాక ప్రవేశాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని తెలిపారు.


