ఆయిల్‌పామ్‌ ధర జోరు.. | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ ధర జోరు..

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

● తాజాగా రూ.23,852కు చేరిన టన్ను గెలలు ● ఏడు నెలలుగా పెరుగుతూ రికార్డు సృష్టిస్తున్న రేటు

కౌలుదారులపై భారమే..

● తాజాగా రూ.23,852కు చేరిన టన్ను గెలలు ● ఏడు నెలలుగా పెరుగుతూ రికార్డు సృష్టిస్తున్న రేటు

అశ్వారావుపేటరూరల్‌: పెరుగుతున్న పామాయిల్‌ గెలల ధర రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. గత నెలలో టన్ను ధర రూ.23,501కు చేరుకోగా, ఈ నెలలో రూ.23,852కు పెరిగింది. టన్నుకు తాజాగా మరో రూ.351 పెరిగి ఆయిల్‌ఫెడ్‌ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు సృష్టించింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటైన తర్వాత అత్యధిక ధర ఇదే కావడం విశేషం. కరోనా సమయం, 2022వ సంవత్సరంలో అత్యధికంగా టన్నుకు రూ.23,467 గరిష్టంగా నమోదైంది. కరోనా సమయం మళ్లీ ఈ ఏడాదిలోనే తర్వాత రూ.23వేల మార్క్‌ దాటింది. దీంతో ఆయిల్‌పామ్‌ సాగుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరలో పెరుగుదల కనిపించగా, ఆరు నెలలుగా పెరుగుతూనే ఉంది. దీంతో మరికొందరు రైతులు పామాయిల్‌ తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ తోటలను కౌలు తీసుకుని సాగు చేసే రైతులపై ధరల భారం పడుతోంది. గతేడాది ఎకరం ఆయిల్‌పామ్‌ తోట కౌలు రూ.45 వేల నుంచి అత్యధికంగా రూ.70 వేలుగా ఉంది. ఈ ఏడాది పామాయిల్‌ గెలల టన్ను ధర పెరుగుదల, ధర తగ్గకపోవడంతో సాగుదారులు ఒకేసారి కౌలు ధరలు పెంచేశారు. గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎకరం కౌలు ఏకంగా రూ.లక్ష దాటింది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎకరం కౌలు ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉండగా, ఈ రెండు మండలాల్లోనే కౌలు ధర ఆందోళన కలిగిస్తోంది. భారీగా పెరిగిన కౌలు ధరలతో చిన్న, సన్నకారు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement