రేపు వర్షం వస్తుంది ! | - | Sakshi
Sakshi News home page

రేపు వర్షం వస్తుంది !

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

● అన్నదాతలకు వాతావరణంపై ముందస్తు సమాచారం ● నేరుగా వాట్సాప్‌లకు ఏఐ ఆధారిత సలహాలు ● పంటల నిర్వహణపైనా సలహాలు, సూచనలు

రైతులకు ప్రయోజనం

● అన్నదాతలకు వాతావరణంపై ముందస్తు సమాచారం ● నేరుగా వాట్సాప్‌లకు ఏఐ ఆధారిత సలహాలు ● పంటల నిర్వహణపైనా సలహాలు, సూచనలు

ఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.

నేరుగా వాట్సాప్‌కు...

వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్‌ఫోన్‌ వాట్సాప్‌కు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్‌ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్‌ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌(డీఐఎల్‌), ఇండియా ఎవిడెన్స్‌ యాక్షన్‌ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

విత్తనాలు, ఎరువులపై కూడా..

వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్‌నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.

ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..

రైతు భరోసా పోర్టల్‌ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్‌ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.

ఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్‌ఫోన్‌ ఉంటున్నందున వాట్సాప్‌కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement