శివాజీనగర: రాష్ట్ర మంత్రిమండలిలో నెలకొన్న లుకలుకలకు పరిష్కార మార్గం కనిపెట్టేందుకు ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఢిల్లీ యాత్రలో ఉన్నారు. బుధవారం కాంగ్రెస్ హైకమాండ్‌తో సమాలోచనలు జరిపారు. ఢిల్లీలో బుధ, గురువారం జరగనున్న కేంద్ర ప్రభుత్వ అధికారిక సమావేశాలు, నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. పనిలో పనిగా కేబినెట్‌లో మంత్రుల అలకలు, ముఖ్యమైన శాఖలు ఇవ్వలేదని మంకుపట్లను ఎలా తీర్చాలనేది పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖలోని బీడీఏ, బీఎంఆర్‌డీఏ విభాగాలను తనకు ఇవ్వనందుకు కృష్ణబైరేగౌడ కినుక వహించి, ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు విన్నవించుకొన్నారు. బీఎంఆర్‌డీఏను ముఖ్యమంత్రి శివకుమార్ తన వద్దే ఉంచుకొన్నారు. ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప కూడా అసంతృప్తితో ఉన్నారు. అలకబూనినవారికి నచ్చజెప్పాలని ఆయన పార్టీ పెద్దలను కోరనున్నారు.
20 మంత్రి బెర్తులు ఖాళీ
హైకమాండ్ నేతలతో సీఎం డీకే సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశముంది. ఇంకా 20 మంత్రి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను 30 మందికి పైగా బలమైన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. పరిపాలన వేగంగా సాగాలంటే పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పడాలని, కాబట్టి త్వరగా మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేయాలని డీకే కోరనున్నారు. ఈ నెల ఆఖరికి మంత్రివర్గ విస్తరణ నెరవేర్చే అవకాశముంది. మళ్లీ 21వ తేదీ తరువాత సిద్దరామయ్యతో కలసి ఢిల్లీకి వెళ్లి నూతన మంత్రులు ఎవరెవరనేది హైకమాండ్‌తో చర్చించి ఫైనల్ చేస్తారని తెలిసింది.
ఎమ్మెల్యేల మకాం
సీఎం ఢిల్లీలో ఉండగా, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హస్తినకు వెళ్లారు. సుమారు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రే వెళ్లారు. మంత్రి పదవి కావాలని, తమ అర్హతలను వివరిస్తూ పార్టీ పెద్దలకు దరఖాస్తులు ఇచ్చారని తెలిసింది. కుర్చీ కోసం తమకు తెలిసిన మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. కొందరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కే.సీ.వేణుగోపాల్, సుర్జేవాలాలను భేటీ చేసి మంత్రి గిరీ కోసం విన్నవించారు. హైకమాండ్ కూడా ఎమ్మెల్యేల జాబితా తీసుకుని వారి గుణగణాలు, ప్రాంతం, తదితరాలను పరిశీలించి ఓ జాబితాను రూపొందిస్తుంది, డీకే, సిద్దు కలిసి పలు దఫాల చర్చల తరువాత ఖరారు చేయవచ్చని సమాచారం.
ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన సీఎం డీకే శివకుమార్, చిత్రంలో రాహుల్, ప్రియాంకగాంధీ
మంత్రి పదవుల ఎంపికలు హైకమాండ్‌కు సవాలే
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో
డీకే శివకుమార్ సమావేశం
కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలతో చర్చలు
నేడు పలు భేటీలకు హాజరు
సోనియాగాంధీతో భేటీ
ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సీఎం డీకే కలిశారు. సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. రాత్రికి సీఎం ఢిల్లీలో మకాం వేశారు. కర్ణాటక సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో విందులో పాల్గొన్నారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చిస్తారని తెలిసింది.


