గోదావరిలో దూకిన వ్యక్తి : కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకిన వ్యక్తి : కాపాడిన పోలీసులు

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

ఐ.పోలవరం: మురమళ్లలోని రాఘవేంద్ర వారధిపై నుంచి గోదావరిలోకి దూకిన వ్యక్తిని హైవే పెట్రోలింగ్‌ పోలీసులు కాపాడారు. ముమ్మిడివరానికి చెందిన దేశంశెట్టి సతీష్‌కుమార్‌ గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాఘవేంద్ర వారిధి నుంచి గోదావరిలోకి దూకాడు. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే ముమ్మిడివరం – పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైవే నిఘా విభాగంలో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, హోంగార్డు రామ్‌కుమార్‌లు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో పడవ నడిపేవారు లేకపోవడంతో, తమ ప్రాణాలకు తెగించి నదిలోకి వెళ్లి సతీష్‌కుమార్‌ను కాపాడారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.

దేవీపట్నంలో

పెద్ద పులి సంచారం

దేవీపట్నం: పెద్దపులి దేవీపట్నం వైపునకు తన గమనాన్ని మార్చింది. ఈ నెల 2న గంగంపాలెం వద్ద 14 లేగ దూడలను చంపేసిన పులి అటు నుంచి నేలకోట వైపు పయనించింది. గురువారం సాయంత్రం రామదుర్గం మీదుగా దండంగి, పరగసానిపాడు వైపు సంచరించిన పులి శుక్రవారం ఉదయం దండంగి వాగును దాటింది. తర్వాత చినరమణయ్యపేట వైపునకు వెళ్లింది. పులి మెడకు అమర్చిన ట్రాకర్‌ ద్వారా పులి గమనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ముత్యాలరాయుడుగారి గొంది, దేవీపట్నం మధ్య పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. రాత్రికి గోదావరి నదిని దాటుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి.

వింత దూడ మరణం

మలికిపురం: మండలంలోని గుడిమెళ్లంకలో శుక్రవారం జెర్సీ క్రాస్‌ ఆవుకు పుట్టిన లేగ దూడ, పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ వివరాలను పశు వైద్యాధికారి డి.శివకుమార్‌ తెలిపారు. గ్రామానికి చెందిన గెడ్డం శ్రీనుకు చెందిన జెర్సీ క్రాస్‌ ఆవు ఈనడంలో అవస్థలు పడుతుంటే డాక్టర్‌ శివకుమార్‌ వైద్య సేవలందించారు. అయితే ఒకే కన్ను, గ్రహణం మొర్రి, నాసిక రంధ్రాలు లేని చనిపోయిన దూడను బయటకు ఆయన తీశారు. ఈ కోవకు చెందిన దూడను వైద్య పరిభాషలో సైక్లోపియా అంటారని చెప్పారు. జన్యులోపం వల్ల, తల, ముఖం అభివృద్ధికి కావాల్సిన క్రోమోజోమ్స్‌ అచేతన స్థితిలో ఉండడం, ఇన్‌బ్రీడింగ్‌, విటమిన్‌ ఏ, జింక్‌ లాంటి పౌష్టికాహార లోపంతో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. కాగా ఆవు ఆరోగ్యంగానే ఉందని, ఇలాంటి దూడలు 16 వేల ఈతల్లో ఒకసారి మాత్రమే జన్మించే అవకాశం ఉందని శివకుమార్‌ అన్నారు.

వ్యక్తిపై దాడి

యానాం: ఇవ్వాల్సిన సొమ్ము అడిగినందుకు ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నియోజకవర్గంలోని మెట్టకూరు వంశీకృష్ణా కాలనీకి చెందిన ఈగల మల్లికార్జునరావుపై అదే గ్రామానికి చెందిన కొప్పనాతి వెంకటరమణ ఐరన్‌ నకల్‌ (హ్యాండ్‌ పంచ్‌)తో దాడి చేశాడు. దీంతో మల్లికార్జునరావు దవడ పళ్లు విరిగిపోయాయి. ఈ ఘటనపై యానాం పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా, నిందితుడు వెంకటరమణపై కేసు నమోదు చేసి యానాం సబ్‌ కోర్టులో హాజరుపరచగా ఆరు రోజుల రిమాండ్‌ విధించారు. మల్లికార్జునరావు టైలర్‌. అతని వద్ద దుస్తులు కుట్టించుకున్న వెంకటరమణ రూ.20 బకాయి ఉన్నాడు. ఆ సొమ్ము గురించి తరచూ మల్లికార్జునరావు అడుగుతున్నాడనే ఆగ్రహంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి తరలిస్తున్న

నిందితుల అరెస్టు

మోతుగూడెం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు డొంకరాయి ఎస్సై చరణ్‌నాయక్‌ తెలిపారు. బొడ్డగండి పంచాయతీ డొంకరాయి గ్రామం వద్ద రెండు కిలోల గంజాయిని, ముగ్గురు నిందితులను, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఒడిశా రాష్ట్రం పసుపులంక నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నారని సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా, వారు పట్టుబడ్డారన్నారు. హైదరాబాద్‌కు చెందిన బొడ్డు అభిషేక్‌, చింతపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement