కూటమిగా ఏర్పడ్డారు.. ఉన్నమట్టుకు దోచేస్తున్నారు.. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.. అనుమతులు లేకుండా మట్టి తవ్వేసి తరలించుకుపోతున్నారు.. ఈ దందా అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు.. ఇలా అక్రమార్కులు రూ.లక్షల్లో ఆర్జిస్తూ మాకెవరు అడ్డు అన్నట్టు చెలరేగిపోతున్నారు.
ఫ మట్టి దందాను
పట్టించుకోని అధికారులు
ఫ చెలరేగిపోతున్న మాఫియా
ఫ రూ.లక్షల్లో ఆర్జిస్తున్న వైనం
తాళ్లపూడి: అక్రమార్కులు కొండలను కరిగించేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని పరిసర గ్రామాలైన పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడేనికి చెందిన రెవెన్యూ పరిధిలోని గోపాలపురం వైపు సగ్గొండ వెళ్లే దారిలో కొండలను తవ్వేస్తున్నారు. కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో అధికార పార్టీ నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మట్టి లారీ లోడు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ అమ్మకాలు సాగిస్తున్నారు. వందల లారీల్లో గ్రావెల్ బయటకు పోతోంది. ఆయా గ్రామాల్లోని కొండలపై ఉన్న జామాయిల్, భారీ చెట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించి, తవ్వకాలు సాగిస్తున్నారు. రోడ్డు లెవెలింగ్‌కు అనుమతులు తీసుకుని, ఆ ముసుగులో గ్రావెల్‌ను లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఈ దందాపై ప్రశ్నించిన వారిని మాఫియా బెదిరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోతున్నారు. దీనిపై మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ స్థానిక నాయకులతో కలసి కొవ్వూరులో శుక్రవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మైనింగ్ ఏడీ ఫణిభూషన్‌రెడ్డి ఇతర అధికారులతో కలసి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.


