అనువణువూ జల్లెడ | - | Sakshi
Sakshi News home page

అనువణువూ జల్లెడ

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

తుని రూరల్‌: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఏడు రోజులైనా లభించలేదు. శుక్రవారం పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ ఆధ్వర్యంలో పోలీస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఫారెస్ట్‌, ఏఎన్‌ఎస్‌ కూంబింగ్‌, క్యూఆర్టీ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగించారు. హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చిన జీపీఎస్‌ ట్రాకర్‌ను పెంపుడు కుక్కకు అమర్చి బయటకు వదిలారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కుక్క ఎనిమిది కిలోమీటర్లు సంచరించినట్టు ట్రాకర్‌ ద్వారా గుర్తించారు. ఆ ప్రాంతాలను దర్యాప్తు బృందాలు అణువణువూ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు కుక్క నిరసంగా ఉండడంతో వెటర్నరీ సిబ్బందితో వైద్య సేవలు అందించారు. అదేవిధంగా చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్‌ మెటల్‌ డిటెక్టర్‌ (డివైజ్‌) నిపుణులతో జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిలక్‌ మాట్లాడుతూ చిన్నారి ఆచూకీ తెలిసేవరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. చిన్నారి తండ్రి సుంకర గణేష్‌కు ఉన్న విరోధులు, ఆర్థిక లావాదేవీలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, గతంలో పనిచేసి మానేసిన కూలీలు, ఇతరేతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. టవర్‌ డంప్‌, సీడీఆర్‌లు, సీసీ కెమెరాల సీపీ ఫుటేజీలు, తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. అనుమానితులు, గంజాయికి అలవాటుపడిన వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. పురోగతిపై సంబంధిత అధికారులతో డీఎస్పీ సమీక్షించారు.

తల్లిదండ్రుల చెంతకు చేరాలి

చిక్కుళ్ల అగ్రహారంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు వద్దకు చేరాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్‌ సీసీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. ఎస్‌.అన్నవరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చిన్నారి ఆయురారోగ్యాలతో తల్లిదండ్రుల వద్దకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పాప కోసం అధికారులు గాలిస్తున్నారన్నారు. ఇటువంటి మనోవేదన మరెవరికి రాకూడదని అన్నారు.

ఫ చిన్నారి కోసం ముమ్మరంగా గాలింపు

ఫ 8 కిలోమీటర్లు

సంచరించిన పెంపుడు కుక్క

ఫ ఆయా ప్రాంతాల్లో బృందాల తనిఖీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement