ఊడిపోయిన స్కూల్‌ బస్సు అత్యవసర ద్వారం | - | Sakshi
Sakshi News home page

ఊడిపోయిన స్కూల్‌ బస్సు అత్యవసర ద్వారం

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

అమలాపురం టౌన్‌: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజునే ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు అత్యవసర ద్వారం ఊడిపడిన సంఘటన అమలాపురంలో శుక్రవారం జరిగింది. ఆ వివరాలివీ.. పరిసర గ్రామాల్లోని విద్యార్థులను శ్రీచైతన్య స్కూల్‌ సిబ్బంది బస్సులో ఎక్కించుకుని పట్టణంలోని స్కూల్‌కు తీసుకు వస్తున్నారు. ఆ సమయంలో స్థానిక నల్ల వంతెన వద్ద బస్సు అత్యవసర తలుపు ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడింది. బస్సు తక్కువ వేగంతో వెళ్తూండటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అదే కనుక బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే బస్సులోని కొందరు కిందపడి ఉండేవారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ను, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ తనిఖీలు సక్రమంగా జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. రవాణా శాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి, జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థల బస్సులను మరోసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీచైతన్య స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రవాణా శాఖ కూడా స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో కాగితాలకు పరిమితమవుతోందే తప్ప స్కూల్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

బస్సు సీజ్‌

అత్యవసర తలుపు ఊడిపోయిన శ్రీచైతన్య స్కూల్‌ బస్సును సీజ్‌ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కుమార్‌ విచారణ చేసి బస్సును సీజ్‌ చేశారన్నారు. ఈ బస్సు రాజమహేంద్రవరం అడ్రస్‌తో రిజిస్టర్‌ అయ్యిందన్నారు. స్కూల్‌ బస్సు స్థానిక ఏటీఎస్‌ సెంటరులో ఈ నెల 4న ఫిట్‌నెస్‌ పొందిందని, అయినప్పటికీ బస్సును సీజ్‌ చేసి, ఫిట్‌నెస్‌ను రద్దు చేసి, బస్సు యాజమాన్యానికి సీఎఫ్‌ఎక్స్‌ నోటీసు జారీ చేశామని వెల్లడించారు. బస్సు పర్మిట్‌పై తదుపరి చర్యలకు రాజమహేంద్రవరం డీటీఓను సంప్రదించామన్నారు. మోటారు వెహికల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement