కాకినాడ రూరల్: మూడు నెలల క్రితం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, పోలీసుల విచారణలో అది హత్యగా తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడి సహాయంతో భర్తను ఓ మహిళ కడతేర్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పవరం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పుల్ల దుర్గాప్రసాద్ (38) మృతికి సంబంధించి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు వాట్సాప్ చాట్స్, స్కీన్ షాట్లు, మొబైల్ ఫోన్ డేటా, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. ఈ విచారణలో దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడని తేలింది. దుర్గాప్రసాద్‌కు రమాదేవితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. రమాదేవికి బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం నడిచింది. వీరి సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని ఆ ఇద్దరూ కలసి హత్యకు కుట్ర పన్నారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేసేందుకు గోపిసాయి నిద్రమాత్రలు తెచ్చి రమాదేవికి ఇచ్చాడు. వాటిని భర్తకు జ్యూస్‌లో కలిపి మార్చి 13న రాత్రి అందజేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తర్వాత అతడిని దిండుతో ఊపిరాడకుండా చేసి రమాదేవి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో భర్త చనిపోయినట్టు బంధువులను నమ్మించడంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మే 31న మృతుడి కుమార్తెకు గోపిసాయి వాట్సాప్ సందేశాలు పంపి, హత్యకు సంబంధించి వివరాలు, మాత్రల కొనుగోలు బిల్లుల ఫొటోలు పంపడంతో అనుమానం పెంచుకున్న కుటుంబ సభ్యులు ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి సోదరుడు పుల్ల సత్యబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హత్యగా తేలిందని సీఐ రమేష్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు.
మూడు నెలల తర్వాత బయటపడిన ఘటన


