వలసపాకల పంచాయతీ గ్రేడ్‌ 5 సెక్రటరీ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

వలసపాకల పంచాయతీ గ్రేడ్‌ 5 సెక్రటరీ సస్పెన్షన్‌

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

కాకినాడ రూరల్‌: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో మండలంలోని వలసపాకల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రేడ్‌ – 5 సెక్రటరీగా పనిచేస్తున్న ఎం.స్నేహలతను సస్పెండ్‌ చేస్తూ కలెక్టరు హరేంధిర ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సంక్షిప్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా సర్‌ ప్రక్రియలో సెక్రటరీ స్నేహలత విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ఆర్డీఓ మల్లిబాబు కలెక్టరుకు నివేదించారు. బీఎల్‌ఓ విధులు హాజరయ్యేందుకు ఆమె నిరాకరించడంతో చర్యలకు ప్రతిపాదించినట్టు మల్లిబాబు తెలియజేశారు. బీఎల్‌ఓ విధులకు హాజరు కాకపోవడానికి ఆమె సరైన కారణం చూపకపోవడంతో కలెక్టరు చర్యలు తీసుకున్నట్టు మల్లిబాబు తెలియజేశారు.

17 మైనింగ్‌ లారీలపై

కేసులు

రౌతులపూడి: కలెక్టరు హరేంధిర ప్రసాద్‌ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన రౌతులపూడి ప్రధాన రహదారిలో మైనింగ్‌, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు పాటించని 17 క్వారీ లారీలపై కేసులు నమోదు చేశారు. మైనింగ్‌శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నల్లరాయిని తరలించే వాహనాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేని ఆరు వాహనాలను సీజ్‌ చేసి స్వాధీన పరచుకున్నారు. అధిక లోడుతో రవాణా సాగిస్తున్న మూడు వాహనాలు, భద్రతా ప్రమాణాలను పాటించని మరో ఎనిమిది వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3,36,000 అపరాధ రుసుం విధించారు. తనిఖీల్లో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.సోనీప్రియ, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరీశంకర్‌, మైనింగ్‌ టెక్నికల్‌ సిబ్బంది సత్యతేజ, రవీంద్ర, కాకినా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఓఎన్‌జీసీ సైట్‌ వద్ద మంటలు

ఆందోళన చెందిన కరప గ్రామస్తులు

కరప: గ్రామ శివారు పంట పొలాల మధ్య ఉన్న ఓఎన్‌జీసీ సైట్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం దట్టంగా పొగలు వ్యాపించి, మంటలు చెలరేగడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని గ్రా మస్తులు ఆందోళన చెందారు. కాకినాడ–రామచంద్రపురం ప్రధాన రహదారికి ఆనుకుని పంటపొలాల మధ్య ఖాళీగా ఓఎన్‌జీసీ సైట్‌ ఉంది. అక్కడ పాత టైర్లు, చెత్త, చెదారం వేశారు. ఓఎన్‌ జీసీ సైట్‌ సమీపంలోని పంటపొలాల్లో కోసిన వరిగడ్డిని రైతులు తగులపెట్టారు. ఈ మంటలు ఒక్కసారిగా వ్యాప్తిచెంది, ఓఎన్‌జీసీ సైట్‌వద్ద ఉన్న పాతటైర్లు, చెత్త అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా నల్లటి పొగ దట్టంగా అలుపుకుని పై కి లేచింది. అక్కడి చెత్త,చెదారానికి మంటలు ఎగబాగడంతో ఆకాశమంతా నల్లగా కనబడటంతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందారు. దారిన వెళ్లేవారు ఏమి జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యా రు. కాకినాడ నుంచి ఫైరింజన్‌ వచ్చి మంటలను ఆర్పివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

రత్నగిరికి భక్తుల రద్దీ

అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement