● మొదలైన చదువుల సందడి
● తొలిరోజు అంతంత మాత్రంగా హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వేసవి సెలవుల్లో ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక చదువులకు స్వాగతం చెప్పారు. బుద్ధిగా పుస్తకాల బ్యాగు భూజానవేసుకుని బడిబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. దీంతో చిన్నారులు ఆటపాటలతో సందడి చేసిన క్రీడామైదానాలు, వీధులు ఒక్కసారిగా బోసిపోయాయి. తొలిరోజు కొంత మంది పిల్లలు మారం చేయగా తల్లిదండ్రులు బుజ్జగిస్తూ పాఠశాలకు తీసుకెళ్లారు. మరికొంతమంది ఉత్సాహంగా వెళ్తూ కనిపించారు. ఉదయం 9 గంటలకు బడిగంట మోగే సరికి బడికి చేరుకున్నారు. తరగతి గదుల్లో కూర్చుని, స్నేహితులను కలుసుకుని సంబరపడ్డారు. దాదాపు 50 రోజల తరువాత విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు తొలుత కుశల ప్రశ్నలు వేస్తూ సరదాగా గడిపారు.
జిల్లాలో 12,85 ప్రభుత్వ, 581 ప్రైవేట్ పాఠశాలలు
జిల్లాలో ప్రభుత్వ 1,285, ప్రైవేట్ 581 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో దాదాపుగా 1.25 లక్షల మంది విద్యాభ్యాసం చేశారు. తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ 94.5శాతం హాజరయ్యారని ప్రకటించినా వాస్తవంగా అంతమంది రాలేదు.
అందని కిట్‌లు
వేసవి సెలవుల నేపథ్యంలో 50 రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి విద్యార్థుల చేతిలో స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, యూనిఫామ్, బెల్టులు, డిక్షనరీలతో కూడిన కిట్‌ను అందజేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థి చేతికి కిట్ అందివ్వగా నేడు ఆ పరిస్థితి లేదు. జిల్లాకు 1,21,268 కిట్‌లకు ఇండెంట్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాగ్‌లు, యూనిఫామ్, ఒకటి కూడా రాలేదు. కేవలం నోట్‌పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్ మాత్రమే జిల్లాకు చేరాయి. దీంతో పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఘూస్ 25,341 ,బెల్టులు 16,878 మాత్రమే వచ్చాయి.


