చంద్రబాబూ.. మీది కోతల ప్రభుత్వం : కురసాల కన్నబాబు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. మీది కోతల ప్రభుత్వం : కురసాల కన్నబాబు

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

కాకినాడ రూరల్‌: పథకాల లబ్ధిదారుల్లో కోత విధించి రెండేళ్లుగా దుర్మార్గపు పాలన అందిస్తున్న చంద్రబాబూ మీది కోతల ప్రభుత్వమని మాజీ మంతి, వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్‌లో నిర్వహించిన బైక్‌ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ అనే శక్తిని ఓడించేందుకు చంద్రబాబు కూటమి కట్టి అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు. సూపర్‌ సిక్స్‌ అని చెప్పి అమలు చేయకుండానే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, ఆడబిడ్డ నిధి ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 6 లక్షల పింఛన్లు తగ్గించారని చెప్పారు. 7 లక్షల అన్నదాత సుఖీభవ, 20 లక్షల మంది తల్లికి వందనం లబ్ధిదారులను కూడ తగ్గించారని, అందుకే మీది కోతల ప్రభుత్వమని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. పబ్లిసిటీ, మీడియాతో నెట్టుకువస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను తీసుకువచ్చి ప్రజల వద్దకు నిజమైన సంక్షేమం తీసుకువస్తే దానిని నీరు గార్చేశారన్నారు. సుపరిపాలన లేదన్నారు. నిలదీస్తే బెదిరిస్తున్నారని, మీ బెదిరింపులకు భయపడమన్నారు. గురువారం రాత్రి నుంచి పోలీసులు తమ పార్టీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారని, ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. డీఎస్సీ పోస్టులను అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. మీ సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అని, అయినా తిరుపతిలో విజయోత్సవ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్‌లకు ఎకరం 99 పైసలకే భూములు కట్టబెడుతున్నారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement