చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

– దాడిశెట్టి రాజా హెచ్చరిక

తుని: అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని, వెన్నుపోటుపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హెచ్చరించారు. శుక్రవారం తుని పట్టణంలో జరిగిన వైఎస్సార్‌ సీపీ ర్యాలీ సందర్భంగా రాజా మాట్లాడుతూ చంద్రబాబును నమ్మి ఓటు వేసి అధికారం కల్పించిన మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని, మహిళలు, విద్యార్థులు, రైతులు, విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వంచనతో కొనసాగిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనడానికి నిరసన ర్యాలీకి వేల సంఖ్యలో జనం తరలిరావడం సాక్ష్యమన్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను వంచించి, స్పోర్ట్స్‌ కోటా పేరుతో అమ్ముకున్నారని ఆరోపించారు. 2029లో చంద్రబాబును గద్దె దింపి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజా అనడంతో ఒక్కసారిగా ప్రజలు ఔను ఔను అంటూ చప్పట్లు కొట్టారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి గ్రామస్థాయిలో హామీల అమలుపై గట్టిగా నిలదీయాలన్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చారంటే కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థమని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement