మిథ్యారంభం కరిష్యామి! | - | Sakshi
Sakshi News home page

మిథ్యారంభం కరిష్యామి!

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

ముగిసిన వేసవి సెలవులు

నేడు మోగనున్న బడి గంట

ప్రారంభం కానున్న నూతన

విద్యా సంవత్సరం

కానరాని సందడి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వేసవి సెలవులను ఎంజాయ్‌ చేసిన విద్యార్థులు శుక్రవారం నుంచి బడిబాట పట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేవారు. స్వాగత తోరణాలు కట్టి ఎంతో సందడి చేసేవారు. ఈ ఏడాది అటువంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రైవేటు పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుండగా.. కూటమి ప్రభుత్వం పుణ్యమా అని సర్కారీ బడులు సౌకర్యాల లేమితోనే ఆహ్వానిస్తున్నాయి. దీంతో, ప్రభుత్వ విద్య మిథ్యగా మారుతుందనే విమర్శలు ఉపాధ్యాయుల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి బడి గంటలు మోగనున్నాయి. ఈ ఏడాది 229 పనిదినాలు కాగా, 87 రోజులు సెలవులుగా పేర్కొంటూ.. పరీక్షల షెడ్యూల్‌ను సైతం పేర్కొంటూ విద్యా శాఖ గురువారం క్యాలెండర్‌ విడుదల చేసింది.

అడ్మిషన్లు పెరిగేనా!

జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో ప్రభుత్వ, మండల/జెడ్పీ, మున్సిపల్‌, ఎయిడెడ్‌ యాజమాన్యాల పరిధిలో 1,285 పాఠశాలలున్నాయి. వీటితో పాటు 573 ప్రైవేటు పాఠశాలు కూడా ఉన్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సర్కారీ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసిపోయేవి. ప్రభుత్వ విద్యా రంగంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నాడు – నేడు పథకం కింద పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. డిజిటల్‌ బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి అపూర్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలను పక్కాగా అమలు చేశారు. వీటన్నింటి ఫలితంగా నాడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు బడి బాట పట్టేవారు. దీంతో, అడ్మిషన్ల సమయంలో పలు ప్రభుత్వ పాఠశాలల వద్ద అంతకు మునుపెన్నడూ చూడని విధంగా హౌస్‌ఫుల్‌ బోర్డులు కూడా పెట్టేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తూండటంతో అడ్మిషన్లు కూడా తగ్గుతున్న పరిస్థితి. విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కార్పొరేట్‌కు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అయితే, ఎంత మేర అడ్మిషన్లు వస్తాయనేది వారం రోజులు గడిస్తేనే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.

అరకొరగా విద్యార్థి మిత్ర కిట్లు

ఏటా పాఠశాలలు పునఃప్రారంభించిన రోజునే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం.. స్కూల్‌ బ్యాగ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, షూస్‌, రెండు జతల సాక్సులు, యూనిఫామ్‌, బెల్టులు, డిక్షనరీలతో కూడిన విద్యా కానుక కిట్‌ను విద్యార్థుల చేతికి క్రమం తప్పకుండా అందించేది. నేడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి కానరావడం లేదు. విద్యా కానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా కూటమి ప్రభుత్వం మార్చింది. పేరైతే ఘనంగా పెట్టారు కానీ.. ఆ మహనీయుని ఖ్యాతికి వన్నె తెచ్చే రీతిలో మాత్రం వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు 1,21,268 విద్యార్థి మిత్ర కిట్లకు ఇండెంట్‌ పెట్టారు. ఇప్పటి వరకూ బ్యాగ్‌లు, యూనిఫామ్‌ ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు. కేవలం నోట్‌ పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ మాత్రమే వచ్చాయి. షూస్‌ 25,341, బెల్టులు 16,878 మాత్రమే వచ్చాయి. ఫలితంగా పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

పూర్తి కాని ‘మన బడి’ పనులు

‘మన బడి – మన భవిష్యత్తు’ రెండో దశ పనులు.. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికే పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ పథకం రెండో దశ కింద పాఠశాలల్లో నిరంతర నీటి సరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, తాగునీటి సరఫరా, విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలల ప్రహరీలపై పెయింటింగ్స్‌, భవనాల మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశలో 881 పాఠశాలలను రూ.334 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా, చాలాచోట్ల ఈ పనులు నిలిచిపోయాయి.

తల్లికి వందనంపై స్పష్టత ఏదీ?

గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ఏటా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేసేది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని చెప్పినా దీనిపై నేటికీ స్పష్టత లేదు.

అడ్మిషన్లకు డ్రైవ్‌

వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం అందించనున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

– పిల్లి రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement