ఆ అడుగులు.. సంక్షేమానికి బాటలు | - | Sakshi
Sakshi News home page

ఆ అడుగులు.. సంక్షేమానికి బాటలు

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

నేడు జగన్‌ పాదయాత్ర

ఉమ్మడి జిల్లాలో అడుగిడిన రోజు

నేటికీ మరపురాని ఆ జ్ఞాపకాలు

కపిలేశ్వరపురం: నడుస్తున్న చరిత్రలో లిఖించదగిన అరుదైన ఘటనల్లో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒకటి. జనం చూపిన మార్గంలో పయనించాలన్న సంకల్పం నుంచి వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం ఓ రికార్డు. 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన ఆయన పాదయాత్ర.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ సాగి విజయవంతంగా ముగిసింది. అంతటి మహా యాత్ర 2018 జూన్‌ 12న అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అడుగు పెట్టింది. గోదారమ్మ చలువతో యాత్ర విజయవంతమై, ఆగస్టు 14న విశాఖ జిల్లా మీదుగా ముందుకు సాగింది.

అడుగడుగునా నీరాజనం

పాదయాత్ర 187వ రోజైన 2018 జూన్‌ 12న రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా రాజమహేంద్రవరం చేరింది. కింద జలగోదారి.. వంతెనపై జనగోదారి అనే రీతిలో అశేష ప్రజానీకం జననేతతో అడుగులో అడుగేయడం చూసి యావత్‌ రాష్ట్రం పులకించిపోయింది. జనం తాకిడికి బ్రిడ్జి పలుమార్లు ఊగడంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో ప్రకంపనలు కలిగాయంటూ అభిమానులు చమత్కరించారు. దిగువన గోదావరిలో 600 పడవలు ఆకర్షణీయంగా నిలిచాయి. జగన్‌ పాదయాత్ర అదే నెల 13న కోనసీమలో ప్రవేశించింది. బొబ్బర్లంక – రావులపాలెం రహదారి జనగోదారిలా మారింది. ఈ యాత్ర సాగిన ధవళేశ్వరం, యానాం తదితర వంతెనలు ఆకర్షణీయంగా మారాయి. బొబ్బర్లంక – రావులపాలెం రహదారి వెంబడి కాలువలో నవరత్నాల నావలు ఆకట్టుకున్నాయి. జగన్‌ హృదయంలో నుంచి జనం వెళ్లేటట్టుగా కాకినాడ రూరల్‌, తునిల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు విశేషంగా ఆకట్టుకుంది. పలు ప్రాంతాల్లో కొబ్బరి మట్టలు, కాయలు, ధాన్యం గుత్తులతో తమ ప్రియ నేతకు జనం ఘన స్వాగతం పలికారు. అమలాపురం, రౌతులపూడి మండలం గిడజాం, ఎస్‌.అగ్రహారం తదితర ప్రాంతాల్లో పూలతో పలికిన స్వాగతం ఎంతో ఆకట్టుకుంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం పారుపాక క్రాస్‌ వద్ద గిరిజనులు అభిమానంతో ఇచ్చిన కొమ్ము తలపాగాను జగన్‌ ధరించారు. పాదయాత్ర ఆగస్టు 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది.

అప్పటి దుష్టపాలనలో చెప్పుకొన్న సమస్యలనేకం

అప్పటి చంద్రబాబు ప్రభుత్వ పాలనతో తాము ఎలా సతమతమవుతున్నామో సామాన్య జనం వైఎస్‌ జగన్‌కు చెప్పుకొన్నారు. నిలువ నీడ లేకున్నా ఇళ్ల స్థలం ఇవ్వడం లేదని, వైకల్యం కళ్లకు కనిపిస్తున్నా పింఛను ఇచ్చేందుకు కనికరం చూపడం లేదని, తమను ఆదరించడం లేదని వృత్తిదారులు సమస్యలు చెప్పుకొన్నారు. కుటీర పరిశ్రమల నిర్వహణ కష్టమవుతోందని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు గోడు వెళ్లబోసుకున్నారు.

భరోసాగా నిలిచి..

నాడు జగన్‌ వేసిన ఆ అడుగులే తదనంతర కాలంలో జన సంక్షేమానికి బాటలు పరిచాయి. నాటి పాదయాత్రలో జనం చేసిన విన్నపాలే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోగా రూపాంతరం చెందాయి. రెండే రెండు పేజీలతో మొత్తం నవ్యాంధ్రప్రదేశ్‌ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశాజ్యోతిగా ఈ మేనిఫెస్టో నిలిచింది. నాటి ఎన్నికల్లో ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను పరిపూర్ణంగా అమలు చేసి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విపత్కర పరిస్థితులను సైతం అధిగమించి.. ఖర్చుకు వెనుకాడకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. అంతటి సంకల్ప బలాన్ని ఇచ్చింది ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement