మీరు మాత్రం రెండు స్థలాలు తీసుకుంటారా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): టీడీపీ జిల్లా కార్యాలయానికి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపాన 1.45 ఎకరాల భూమిని ప్రభుత్వం లీజుకు కేటాయించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇళ్లు లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల చొప్పున స్థలాలిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎవ్వరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, అటువంటిది టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ఓవైపు టీడీపీ జిల్లా కార్యాలయం లీజులో ఉండగా మళ్లీ ప్రభుత్వ భూమి తీసుకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. దీనిపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో చర్చించి, టీడీపీ కార్యాలయం భూమి పూజను అడ్డుకుంటామని మధు హెచ్చరించారు.
పొరపాట్లు లేకుండా
భూ రికార్డుల పోర్టింగ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఎటువంటి పొరపాట్లూ లేకుండా భూ రికార్డుల పోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జేసీ అపూర్వ భరత్ అన్నారు. ప్రత్తిపాడు మండలం పి.జగన్నాథపురం, తొండంగి మండలం కృష్ణాపురం గ్రామాల్లో జరుగుతున్న పోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన భూ రికార్డులను ఆయన కలెక్టరేట్‌లో గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన 22ఏ జాబితాలు, ఫ్రీ హోల్డ్ భూములు, ఇతర భూ సమాచార వివరాలను వీఆర్‌ఓలు, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సమక్షంలో నిశితంగా పరిశీలించి, నమోదైన వివరాల కచ్చితత్వాన్ని ధ్రువీకరించారు. జాయింట్ ఎల్‌పీఎంలు 2 శాతానికి మించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకత, కచ్చితత్వంతో భూ రికార్డుల నవీకరణను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జేసీ దిశానిర్దేశం చేశారు.
విలువలతో కూడిన విద్య అందించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): విలువలతో కూడిన విద్య అందించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక మధురా నగర్‌లో ఇస్కాన్ – బెంగళూరు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన బాసిల్ వుడ్ స్కూల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం చదువుకు సంపాదనే లక్ష్యంగా ఉందని, విలువలకు ప్రాధాన్యం ఉండటం లేదని అన్నారు. ఇస్కాన్ సంస్థ నిర్వాహకుడు ప్రభుదాస్ మాట్లాడుతూ, బాసిల్ వుడ్ స్కూల్ మొదటి శాఖ బెంగళూరులో ఉందని, ఇప్పుడు కాకినాడలో ప్రారంభించామని చెప్పారు. ఈ స్కూల్లో విద్యార్థులకు ఆడుతూ పాడుతూ చదువు చెప్పడమే కాకుండా, భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలపై అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా మనోధైర్యంతో ఎదుర్కొనేలా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పిస్తామని అన్నారు.
లింగ నిర్ధారణ ఫిర్యాదులకు
టోల్ ఫ్రీ నంబర్
కాకినాడ క్రైం: గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షలపై ఫిర్యాదులకు ఉచిత టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లింగ నిర్థారణ చేసినా, చేయాలని కోరడం పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం తీవ్ర నేరమని స్పష్టం చేశారు. అటువంటి ఉదంతాలు గుర్తిస్తే 1800 233 2447 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.


