ప్రత్తిపాడు: పదహారో నంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన బొడ్డు వెంకట రామకృష్ణ, భార్య పద్మావతి (51) బైక్‌పై ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో పొలం పనులు చూసుకుని తిరిగి వెళ్తున్నారు. స్థానిక సంతోషిమాత గుడి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా, వారి బైక్‌ను వెనుక నుంచి వస్తున్న పాల డెయిరీకి చెందిన ట్యాంకర్ ఢీకొంది. పద్మావతి కింద పడిపోగా, ఆమె తలపై నుంచి ట్యాంకర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. వెంకట రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని హైవే అంబులెన్స్‌లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కలెక్టరేట్ సీనియర్
అసిస్టెంట్ సస్పెన్షన్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి.. ఏసీబీ దాడిలో పట్టుబడిన కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ చోడపురెడ్డి శివరామ్ కుమార్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం సస్పెండ్ చేశారు. శివరామ్ కుమార్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లు, ఆస్తులు, కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఈ నెల 5న ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. శివరామ్ కుమార్‌ను అరెస్టు చేసి, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు రిమాండు విధించింది. ఈ నేపథ్యంలో శివరామ్ కుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఐజీ తనిఖీలు
కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యాన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. నేర నియంత్రణ, మహిళలు, బాలికల భద్రత, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల అక్రమ రవాణా, నివారణపై పలు సూచనలు చేశారు. జిల్లా పోలీసు శాఖ కార్యకలాపాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.


