23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టుగా.. ఆ చిన్నారి పిల్ల కొంచెం.. ప్రతిభ ఘనమని నిరూపించుకుంది. నగరంలోని రామకృష్ణారావుపేట కొత్తూరు వీధికి చెందిన షేక్ ఖాజా మొహిదీన్ దంపతుల కుమార్తె 23 నెలల షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ అద్భుత ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకొంది. చిన్న వయస్సులోనే పండ్లు, కూరగాయలు, ఇంగ్లిషు అక్షరాలు, వాటి ఫోనెటిక్ పదాలు, 1 నుంచి 10 అంకెలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, బొమ్మలు, రుతువులు, గృహోపకరణాలను గుర్తించి చెబుతోంది. వివిధ రైమ్స్ కూడా చక్కగా వల్లె వేస్తూ ‘వన్ ఇన్ ఎ మిలియన్’గా గుర్తింపు పొందింది. ఆ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆమెను, తల్లిదండ్రులను గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌కు పిలిపించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు పరిశీలించి, 23 నెలల వయస్సులోనే ఖాదరి నవాజ్ ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆమె అసాధారణ ప్రతిభ పట్ల కలెక్టర్‌తో పాటు పలువురు ప్రముఖులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఖాదరి నవాజ్ తల్లి మహమ్మద్ బషీర్ మహమ్మద్ గృహిణి కాగా, తండ్రి సయ్యక్ ఖాజా మొహిద్దీన్ చైన్నెలో వైర్‌లెస్ సిస్టమ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.


