వాయు బీభత్సం.. వరుణ తాండవం | - | Sakshi
Sakshi News home page

వాయు బీభత్సం.. వరుణ తాండవం

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో మధ్యాహ్నం వరకూ సూర్య దేవుడు ప్రతాపం చూపగా.. సాయంత్రం వాయు దేవుడు, వరుణ దేవుడు కలసి బీభత్సం సృష్టించారు. బలమైన ఈదురు గాలులతో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. పెనుగాలులు మంగళవారమే బీభత్సం సృష్టించగా.. రత్నగిరి నుంచి దిగువకు వచ్చే ఘాట్‌ రోడ్డులో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డు మీద కూలాయి. అన్నదానం భవనం, శ్రీ సీతారామ సత్రం, సత్యగిరి మీద కూడా పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్‌ తీగలు తెగిపోయి, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూలిపోయిన చెట్లను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ ఆధ్వర్యాన సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. ప్రధానంగా ఘాట్‌ రోడ్ల మీద పడిన చెట్లను నరికి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ స్తంభాలు, తీగల మీద పడిన చెట్లను తొలగించే కార్యక్రమం కూడా చేపట్టారు. రాత్రి 8 గంటల సమయానికి చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని రామకృష్ణ తెలిపారు. ఈదురు గాలుల తాకిడికి అన్నవరం గ్రామంలోని కొత్తపేట సహా పలుచోట్ల చెట్లు విరిగిపడి, విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. దీంతో, గ్రామంలో కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాయకరావుపేట సబ్‌ స్టేషన్‌ నుంచి అన్నవరం సబ్‌ స్టేషన్‌కు ఉన్న 33 కేవీ లైన్‌ మీద చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్‌ ఏఈ పి.ప్రసాద్‌ తెలిపారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులను సిబ్బంది చేపట్టారు.

తొండంగిలో..

తొండంగి: మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ఈదుర గాలులు వీచి, కుండపోత వర్షం కురిసింది. తొండంగి – శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి – కొమ్మనాపల్లి సీతారాంపురం రహదారులతో పాటు పెరుమాళ్లపురం బీచ్‌ రోడ్డులో భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెట్ట గ్రామాల్లోని అరటి తోటల్లో చెట్లు నేలకూలడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. పెరుమాళ్లపురం పంచాయతీ అవల్దార్‌పాడులో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు రావడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి, వైర్లు తెగిపోవడంతో ఎ.కొత్తపల్లి, కొమ్మనాపల్లి, రావికంపాడు, సీతారాంపురం, బెండపూడి, కోన తీర ప్రాంత గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్‌ శాఖ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కుండపోత వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రావికంపాడులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రధాన రహదారి పంట కాలువను తలపించింది. పంచాయతీ అధికారులు ప్రధాన డ్రైనేజీలో పూడిక తీయకపోవడంతో మురుగు నీరు, వాన నీరు కలసి ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానిక బీసీ కాలనీ, ఓసీ కాలనీ వాసులు వాపోయారు.

తొండంగిలో ఈదురు గాలులకు దెబ్బ తిన్న అరటి తోట

చెట్లు విరగడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

రత్నగిరి ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన చెట్టు

ఫ రత్నగిరిపై పెనుగాలులు, భారీ వర్షం

ఫ ఽఘాట్‌ రోడ్డులో విరిగిన చెట్లు

ఫ తెగిన విద్యుత్‌ తీగలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement