జగ్గంపేట: ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటూండగా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యాన్ని మిల్లులకు పంపించి 15 రోజులవుతున్నా ఇప్పటి వరకూ సంబంధిత సొమ్ము ఇవ్వలేదని ఆగ్రహిస్తూ కాట్రావులపల్లి వద్ద రైతులు బుధవారం రాస్తారోకో చేయడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. రైతుల కథనం ప్రకారం.. కాట్రావులపల్లి, రామవరం గ్రామాలకు చెందిన అన్నదాతలు గత నెల 19కి ముందు సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించారు. తామంతా వేరే పనుల్లో బిజీగా ఉన్నామని.. మిల్లులకు ధాన్యం తరలించాలని, మిగిలిన ప్రొక్యూర్‌మెంట్ పని తాము పూర్తి చేస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అధికారులు ఆ సమయంలో చెప్పారు. ఆ మేరకు తాము మిల్లులకు ధాన్యం తరలించామని, ఆ డబ్బుల కోసం అధికారులను అడిగితే, తమ ధాన్యం ప్రొక్యూర్‌మెంట్ జరగలేదని, సివిల్ సప్లయిస్ టార్గెట్ అయిపోయిందని ఇప్పుడు చెబుతున్నారని రైతులు మండిపడ్డారు. మిల్లులకు పంపిన ధాన్యానికి ఎవరు డబ్బులిస్తారని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో కాట్రావులపల్లి – పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ జేవీఆర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) ఎస్.నరసింహం తదితరులు రైతులతో చర్చించారు. ఈ రైతులు రైతు సేవా కేంద్రాలతో సంబంధం లేకుండా మధ్యవర్తుల ద్వారా మిల్లులకు ధాన్యం తరలించారని ఎంఏఓ నరసింహం తెలిపారు. సీఎంఆర్ రైస్ జిల్లా టార్గెట్ పూర్తవడంతో సివిల్ సప్లయిస్ అధికారులు ఆ ధాన్యం సేకరించలేదని చెప్పారు. ఈ రైతుల సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని అన్నారు.
ఫ కాట్రావులపల్లి వద్ద రైతుల ఆందోళన
ఫ అధికారులు సంబంధం
లేదంటున్నారని ఆగ్రహం


