పిఠాపురం: సుదీర్ఘ వేట విరామం తరువాత గంగపుత్రులు బోట్లకు లంగరు తీసి కడలి ఒడిలోకి బుధవారం పయనమయ్యారు. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ నుంచి చేపల వేట పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నాలుగు చేపలు వెనకేసుకోవాలనే గంపెడాశతో మత్స్యకారులు నాలుగు రోజులు ముందుగానే తమ జీవన పోరాటాన్ని పునఃప్రారంభించారు. రెండు రోజులుగా తమ బోట్లు, వలలను సిద్దం చేసుకున్న మత్స్యకారులు బుధవారం తెల్లవారుజాము నుంచి తమ ఇష్ట దైవాలకు పూజలు, ప్రార్థనలు చేసుకుని సముద్రంపై వేటకు బయలుదేరారు. ఇటు ఐస్ ఫ్యాక్టరీలు, ఆయిల్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు నిత్యం చేపల రవాణా చేసే వందలాది వాహనాలు సాగర తీరానికి ఇప్పటికే చేరుకున్నాయి. దీంతో, గత 55 రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగరతీరం మళ్లీ పూర్వ కళను సంతరించుకుంది. ఈ ఏడాది డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో తమపై మోయలేనంత ఆర్థిక భారం పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలలపై సయ్యాటలాడుతూ.. బోట్లపై
వేటకు పయనమవుతున్న గంగపుత్రులు
ఉప్పాడ వద్ద లంగరు తీసి వేటకు
బయలుదేరుతున్న బోట్లు


