తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకోరా?

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. తొలుత చైర్మన్‌ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్‌, విద్యుత్‌ తదితర శాఖల్లో వివిధ పనుల పురోగతి, కొత్త ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గొల్లప్రోలు, ప్రతిపాడు, జగ్గంపేట గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీరు మట్టి వాసన వస్తోందని, రంగు మారుతోందని, అయినప్పటికీ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు. రావులపాలెం, యు.కొత్తపల్లి గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు మట్టి తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బుర్రా అనుబాబు మాట్లాడుతూ, ధాన్యానికి గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీవీఎస్‌ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement