కోటనందూరు: పిడుగుపాటుకు ఓ ఆవుల కాపరి మృతి చెందాడు. మండలంలోని పాత కొట్టాం గ్రామానికి చెందిన యడ్ల జానీ ప్రసాద్ (40) రెండు ఆవులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం ఆవులను మేపేందుకు వ్యవసాయ మకాం దగ్గర్లోని పంట పొలాలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో చెవి నుంచి రక్తస్రావమై పొలంలోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే జానీప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెవి నుంచి రక్తస్రావం కావడం, ఫోన్ పాడైపోవడంతో.. ఫోన్ మాట్లాడుతూంటుండగా పిడుగుపాటుకు గురైననట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు జానీ ప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా కొత్త కొట్టాం గ్రామంలో లగుడు బాపన్న దొరకు చెందిన గెదే పిడుగుపాటుతో మృతి చెందింది.


