వెక్కిరిస్తున్న పొలాలు | - | Sakshi
Sakshi News home page

వెక్కిరిస్తున్న పొలాలు

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముందస్తు సాగు అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడి మాటలతో సరి అన్నట్టుగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పది రోజుల కిందటే హడావుడిగా అమాత్యులు నీటిని విడుదల చేశారు. కానీ, కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో ఆ జలాలు ఇప్పటికీ పంట భూములకు చేరలేదు. ఫలితంగా ఎక్కడ చూసినా తడారిన పొలాలే కనిపిస్తూ.. సర్కారు పనితనాన్ని వెక్కిరిస్తున్నాయి. అధికారులు ముందస్తు సాగు చేయాలంటున్నా.. చుక్క నీటి కోసం ఎదురు చూపులు తప్పక.. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తయారైంది జిల్లాలోని ఖరీఫ్‌ రైతుల పరిస్థితి.

కాగితాల పైనే ప్రణాళిక

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. పంట కాలం ముగిసే సమయానికి ప్రకృతి విపత్తులు వచ్చే ప్రమాదముంటుందని ఓవైపు.. అలాగే, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం కూడా ఉంటుందని మరోవైపు చెబుతూ.. ముందస్తు సాగు చేయాలంటూ రైతులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా నారు పోసుకుని, జూలై మాసాంతానికి వరి నాట్లు పూర్తి చేయాలని మండల, గ్రామ స్థాయిల్లో లక్ష్యాలు పెట్టారు. ఈ ప్రణాళికంతా కాగితాలపై సజావుగానే సాగింది. మరోవైపు ఇటీవల జరిగిన సమావేశంలో సైతం నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారులు ఖరీఫ్‌ ముందస్తు సాగు ఆవశ్యకతను గట్టిగా చెప్పారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు రైతులను చైతన్యపరచాలని కోరారు. ముందస్తు సాగు పేరుతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత నెల 31నే గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశారు. అక్కడితో తమ పనైపోయినట్టు.. మిగిలిన విషయాలను గాలికొదిలేశారు. ముందస్తు సాగుకు రైతులు సైతం సిద్ధమేనని అంటున్నా.. వివిధ కారణాలతో ఇప్పటి వరకూ పొలాలకు చుక్క నీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. సాగునీరు అందక జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క రైతు కూడా ఖరీఫ్‌ సాగుకు కనీస సన్నాహాలు కూడా చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.

10 రోజులు గడచినా..

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పంట కాలువలకు నీరు విడుదల చేసి అప్పుడే 10 రోజులైంది. ప్రారంభంలో 500 క్యూసెక్కుల నీటిని వదలగా.. దానిని క్రమంగా, 1,200, 2,700 వరకూ పెంచారు. సోమ, మంగళవారాల్లో 3,600 క్యూసెక్కుల వరకూ విడుదల చేశారు. పెద్ద మొత్తంలో నీటిని వదులుతున్నప్పటికీ పంట భూములకు ఆ నీరు చేరడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత గడచిన రెండేళ్లుగా క్లోజర్‌ పనులు సక్రమంగా చేపట్టకపోవడమే దీనికి కారణమని రైతులు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో పంట కాలువల్లో గుర్రపు డెక్క విస్తారంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా పూడికలే కనిపిస్తున్నాయి. ఇవి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ఫలితంగా పొలాలకు నీరు అందడం లేదు. సామర్లకోట, పెద్దాపురం, కరప, తాళ్లరేవు, కాకినాడ రూరల్‌, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్‌ తదితర మండలాల్లోని వేలాది మంది రైతులు గోదావరి కాలువ పైనే ఆధారపడి సాగు చేస్తారు. వారందరూ సాగునీటి కోసం ఈ పది రోజులుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈవేళ వస్తుంది, రేపు వస్తుందంటూ క్షేత్ర స్థాయిలో నీటి పారుదల, వ్యవసాయ అధికారులు వారిని బుజ్జగిస్తూ వస్తున్నారు. అయితే, నారుమళ్లు తయారవడానికి కనీసం 20 రోజులు పైనే పడుతుంది. ఇప్పటి వరకూ సాగునీరు ఇవ్వకపోతే ముందస్తు సాగు ఏవిధంగా సాధ్యమని, నారు ఎప్పుడు పోసుకోవాలి, దమ్ములెప్పుడు చేయాలి, నాట్లు ఎప్పుడు వేయాలో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రబీలో ప్రభుత్వం సమయానుకూలంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వారికి శాపంగా మారింది. పంట చేతికందిన దశలో అకాల వర్షాలు వారికి ఊహించని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ ప్రభుత్వం నయాపైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కనీసం ఖరీఫ్‌ ముందస్తు సాగుకు వెళ్లాలనుకున్నా సాగునీరు అందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ముందస్తు సాగు విధానాన్ని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూపొందించి, పక్కాగా అమలు చేసింది. ఈ విధానం వలన మిగిలిన ప్రాంతాల రైతులు కన్నా జిల్లాలోని రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు సాగును ప్రహసనంగా మార్చేసి తమను ఇబ్బంది పెడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద పుష్కర కాలువ దుస్థితి

సామర్లకోట వద్ద గోదావరి కాలువలో పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపు డెక్క

ఫ ‘ముందస్తు’ హడావుడి.. మాటలకే సరి!

ఫ గత నెల 31న నీటి విడుదల

ఫ ఇప్పటి వరకూ పంట భూములకు

అందని నీరు

ఫ చుక్క నీటి కోసం రైతుకు తప్పని ఎదురు చూపులు

ఫ ముందుకు ‘సాగే’దెలాగని కలవరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement