అట్టర్‌ఫ్లాప్‌ సినిమాకు విజయోత్సవంలా.. | - | Sakshi
Sakshi News home page

అట్టర్‌ఫ్లాప్‌ సినిమాకు విజయోత్సవంలా..

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

కాకినాడ రూరల్‌: ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటూ హామీలిచ్చారని, అవేవీ అమలు చేయకుండానే.. అట్టర్‌ఫ్లాప్‌ సినిమాకు విజయోత్సవం అన్నట్టుగా.. చంద్రబాబు సర్కారు సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సక్సెస్‌ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్‌ సీపీ రూరల్‌, ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. స్థానిక బోట్‌క్లబ్‌ ఎదురుగా కృషి భవన్‌లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కాకినాడ రూరల్‌ నియోజకవర్గ స్థాయి సదస్సు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ సదస్సులో కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేసేందుకే జగన్‌ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు. అన్ని వర్గాలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆడబిడ్డ నిధి అమలు చేయలేదని, మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని చెప్పారు. కొత్తగా పెన్షన్‌ ఇవ్వాలంటే భర్త చనిపోవాలని, ఇదీ చంద్రబాబు స్కీమ్‌ అని దుయ్యబట్టారు. మొదటి సంతకాన్ని ఎవరైనా దైవంగా భావిస్తారన్నారు. జగన్‌ 6,500 ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే చంద్రబాబు 16 వేల ఉద్యోగాలిస్తామంటూ పరీక్షకు రాని వారికి కూడా ఇచ్చారని విమర్శించారు. ‘స్పోర్ట్స్‌ కోటాలో బ్రిడ్జి గేమ్‌ ఉందంట. బ్రిడ్జి అంటే పేకాట అంట’ అని ఎద్దేవా చేశారు. జగన్‌ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించేవారని, చంద్రబాబు ప్రభుత్వం అలా ఎందుకు చేయలేకపోతోందని నిలదీశారు. దమ్ముంటే జాబితాలు పెట్టి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఎకరా 99 పైసలకు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకేమీ చేయలేదని దుయ్యబట్టారు. ఎవరైనా విమర్శిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

స్టీల్‌ప్లాంట్‌ మృతుల కుటుంబాలకు

రూ.కోటి పరిహారం ఇవ్వాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చాలా దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నది వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ అని కన్నబాబు స్పష్టం చేశారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారని, ఎనిమిది మంది మరణించపోగా మరో ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అన్నారు. అక్కడి పరిస్థితిని తాము ప్రత్యక్షంగా పరిశీలించామని, అంతటా హృదయ విదారక వాతావరణం నెలకొందని చెప్పారు. ‘మాకంటే ముందు ముఖ్యమైన మంత్రిగా ఉన్న లోకేష్‌ వెళ్లారు. కార్మిక సంఘాల నేతలనుద్దేశించి మీకేం సంబంధం? మీ ఇంట్లో వారు చనిపోయారా? అని అడిగారు. దీనిని అహం అనాలా?’ అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూండగా.. కార్మిక సంఘాలు రూ.కోటి పరిహారం డిమాండ్‌ చేయడంతో ఇచ్చేస్తారన్నట్టు చెబుతున్నారన్నారు. అదే ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదానికి చలించిపోయిన తమ నేత జగన్‌ అప్పట్లో ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందజేశారని కన్నబాబు గుర్తు చేశారు. వెంటిలేటర్‌ మీద ఉన్నవారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. విష వాయువులు పీల్చిన 15 వేల మందికి సైతం పరిహారం అందజేశారని, అప్పట్లో ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న తాను, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, మరి కొంత మంది మంత్రులం సహాయక చర్యల్లో పాల్గొన్నామని చెప్పారు. నాడు రూ.కోటి పరిహారంపై దేశమంతా ఉలిక్కిపడి చూసిందని, తరువాత ఫార్మా కంపెనీలో ప్రమాదంలోనూ రూ.కోటి పరిహారం ఇప్పించారని చెప్పారు.

అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి

తండ్రి సంపాదించిన అధికారం, డబ్బు, సీటు శాశ్వతమనుకుంటున్నారని, ఇవేవీ పని చేయవని, చేసిన పనులే శాశ్వతమని కన్నబాబు హితవు పలికారు. కోటి సంతకాల ఉద్యమంతోనే 17 మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఆగిందని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను జగన్‌ ఆపారని అన్నారు. చంద్రబాబు రూ.3.70 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో తెలీదని చెప్పారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కన్నబాబు అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, చింతా ఈశ్వరరావు, కరీం బాషా, మాజీ మేయర్‌ సరోజ, మాకినీడి శేషుకుమారి, పంతం ఇందిర, పబ్బినీడి పాపారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పిఠాపురంలో మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వంగా గీత ఆధ్వర్యాన, పెద్దాపురంలో అక్కడి కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాలు జరిగాయి.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

ఫ కూటమి సర్కారు తీరుపై విమర్శలు

ఫ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’

సదస్సులో కన్నబాబు ఎద్దేవా

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): హరిత వాతావరణ నిధి (జీసీఎఫ్‌) లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి ఎన్‌.రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్తగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టాలని, దీంతో పాటు గతంలో 180.58 హెక్టార్లలో పునరుద్ధరించిన అడవుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తీరప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, పరిసర తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సాధించిన ఫలితాలను అధికారులు వివరించారు. జిల్లాలో మడ అడవుల పునరుద్ధరణ, జీవనోపాధి రంగాల్లో గణనీయమైన ప్రగతి నమోదైందని రామచంద్రరావు తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ టి.తిప్పేనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement