వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించాలి

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అధికారుల వేధింపులు ఆపాలని, వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు సంఘం అన్ని మండలాల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అధికారుల నిరంకుశ వేధింపుల కారణంగా కర్నూలు జిల్లాలో వీఆర్‌ఓగా పని చేస్తున్న మహ్మద్‌ హుస్సేన్‌ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఒకే సమయంలో వేర్వేరు పనులు అప్పగించడంతో, అధిక పని ఒత్తిడి తట్టుకోలేకపోయారన్నారు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా అదనపు డ్యూటీలు వేసి, హుస్సేన్‌ను క్షోభకు గురి చేశారని, అందువల్లనే ఆయన ఉరి వేసుకుని బలవన్మరణం చెందారని చెప్పారు. హుస్సేన్‌ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమయ పాలనతో విధులు నిర్వహించేలా అధికారులు సహకరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జేఏసీ వైస్‌ చైర్మన్‌ అల్లాడి మల్లేష్‌, కాకినాడ డివిజన్‌ కార్యదర్శి మేడిశెట్టి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలు

ముందుకు రావాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వం – పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విశాఖపట్నం విభాగం, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యాన నగరంలో మంగళవారం జరిగిన పారిశ్రామిక సదస్సులో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ తీర ప్రాంతం, మూడు ప్రధాన ఓడరేవులతో కూడిన బలమైన రవాణా వ్యవస్థ, 22 ఇండస్ట్రియల్‌ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలి జిల్లాలో ఉన్నాయన్నారు. సముద్ర ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్‌, రసాయన పరిశ్రమలకు జిల్లా ఎంతో అనుకూలమని కలెక్టర్‌ అన్నారు. సమావేశంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ చైర్మన్‌, శ్రావణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ఎండీ జి.సాంబశివరావు, సీఐఐ విశాఖపట్నం ఎండీ జి.కృష్ణమోహన్‌, వైస్‌ చైర్మన్‌ నీలేష్‌ అగర్వాల్‌, ఓజిలి తదితరులు పాల్గొన్నారు.

బొండాలు రకం

ధాన్యం కొనుగోలుకు సిద్ధం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): బాయిల్డ్‌ రకం ధాన్యం (బొండాలు) కొనుగోలుకు తాము సిద్ధమని రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు తెలిపారు. కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా తాము రైతుల నుంచి ఈ రకం సేకరిస్తామన్నారు. 75 కేజీల బస్తాకు 48 గంటల్లోగా రూ.1,817 చెల్లిస్తామన్నారు. మిల్లర్లే వాహనాలు సమకూర్చితే ఒక్కో బస్తాకు రూ.40 చొప్పున తగ్గిస్తున్నామని చెప్పారు. ధాన్యం విక్రయించే రైతులు 94941 54576, 94415 63243 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఆంధ్రా టెన్నిస్‌ బాల్‌

ప్రీమియర్‌ లీగ్‌కు ఎంపిక

పిఠాపురం రూరల్‌: ఆంధ్రా టెన్నిస్‌ బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు పిఠాపురం క్రీడాకారుడు పాలూరి వీరు ఎంపికయ్యాడు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన క్రీడాకారుల వేలంలో వీరును రూ.79 వేలకు కడప కింగ్స్‌ ఫ్రాంచైజీ దక్కించుకుంది. టెన్నిస్‌ బాల్‌, క్రికెట్‌లో ఉన్న ట్రాక్‌ రికార్డు, ఆల్‌ రౌండర్‌ నైపుణ్యాలు కారణంగానే వీరుకు ఈ వేలంలో అత్యధిక ధర పలికినట్లు తెలుస్తోంది. వీరును స్థానిక క్రీడాకారులు, అసోషియేషన్‌ ప్రతినిధులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement