అన్నవరం: బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నవరంలో మంగళవారం బీభత్సం సృష్టించింది. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకూ వీచిన పెనుగాలులు, కురిసిన వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు కూలి, విద్యుత్ వైర్ల మీద పడటంతో స్తంభాలు విరిగిపోయాయి. విశాఖపట్నం – రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై సత్యదేవుని కొత్త నమూనా ఆలయం వద్ద టాయిలెట్ల మీద రేకులు పక్కనే ఉన్న పొలాల్లోకి ఎగిరిపోయాయి. వాటి తలుపులు సైతం ఊడిపోయాయి. అక్కడే నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్లు వంగిపోయాయి. కొంతవరకూ నిర్మించిన గోడలు కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న నమూనా ఆలయం పక్కనే ఉన్న ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్‌లోని షెడ్డు మీద రేకులు కూడా ఎగిరిపోయాయి. ఈదురు గాలుల తాకిడికి స్థానిక కొత్తపేట సమీపాన తీగల మీద చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాయకరావుపేట సబ్ స్టేషన్ నుంచి అన్నవరం సబ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్ మీద కూడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయని ఈపీడీసీఎల్ ఏఈ పి.ప్రసాద్ తెలిపారు. తీగలపై పడిన చెట్ల కొమ్మలను తొలగించి, విద్యుత్ స్తంభాలను నిలబెట్టి, సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, ఏలేశ్వరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో కూడా పెనుగాలులతో వర్షం కురిసింది. పిఠాపురంలో బలమైన గాలులు వీచాయి.


