బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అత్యంత దారుణంగా పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు వామపక్షాల నాయకులు స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద మంగళవారం రాస్తారోకో, అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటి వరకూ నాలుగుసార్లు పెంచిందని, గ్యాస్ ధరలు రెండుసార్లు పెంచిందని గుర్తు చేశారు. కమర్షియల్ వంట గ్యాస్ ధర ఏకంగా రూ.3,250కి చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, సామాన్యులకు ఆహార కొరత ఏర్పడిందని చెప్పారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం వల్ల ధరలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులను రిలయన్స్ కంపెనీ మహారాష్ట్ర, గుజరాత్‌లకు తరలించుకుపోతూ, ఇతర దేశాలకు కూడా అమ్ముకుంటోందని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్న చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలంటూ 12వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు తెలియదా అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న టీడీపీ, జనసేన నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. చమురు, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


