కాపు కాయక.. | - | Sakshi
Sakshi News home page

కాపు కాయక..

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

ధర ఉన్నా..

ప్రస్తుత మార్కెట్‌లో బంగినపల్లి రకం మామిడి ధర టన్ను రూ.30 వేల పైబడి ఉంది. రాజోలు దీవి నుంచి ప్రతి ఏడాది సుమారు వెయ్యి టన్నుల బంగినపల్లి రకం ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి 10 టన్నులు కూడా దిగుబడి అనుమానమేనని రైతులు చెబుతున్నారు. వీటిలో మంగు సోకిన కాయలు ఎగుమతికి పనికి రావు. దీంతో ఆ రకం కాయల విక్రయాలు ఇక్కడే జరుగుతాయి. మంగు సోకని క్వాలిటీ రకాన్ని మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

రైతులను ఆదుకోని మామిడి

నిరుత్సాహపర్చిన బంగినపల్లి దిగుబడి

ధర ఉన్నా దిగుబడి శూన్యం

రైతులకు, తోటల లీజుదారులకు భారీ నష్టం

మలికిపురం: వేసవి కాలం అనగానే అందరికీ ఠక్కున మామిడి పండ్లు గుర్తుకువస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు. మామిడి తోటల్లో, రోడ్డు పక్కనే దుకాణాల్లో, మార్కెట్లలో, వీధుల్లో బండ్లపై వీటి విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇక మామి డి పండ్లలో రారాజుగా పిలుచుకునే, మామిడి ప్రియులకు ఎంతో ఇష్టమైన బంగినపల్లికి ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది ఈ రకం కాపు పూర్తిగా నిరాశ పరిచింది. మార్కెట్‌లో ధర బాగున్నా దిగుబడి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

గూడపల్లి ప్రసిద్ధి

బంగినపల్లి మామిడి పండ్లకు గూడపల్లి ప్రసిద్ధి. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎగుమతులు జరుగుతాయి. గూడపల్లితో పాటు గుబ్బలపాలెం, పల్లిపాలెం, కేశనపల్లి, తూర్పుపాలెం, కరవాక, గొల్లపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, కేశవదాసుపాలెం, బట్టేలంక, ఇరుసుమండ, అడవిపాలెం, లక్కవరం, కత్తిమండ, మోరిపోడు, వీవీ మెరక తదితర గ్రామాలు మామిడి తోటలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే వాతావరణం అనుకూలించక ఈ ఏడాది కూడా దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు మంచు తీవ్రత అధికంగా ఉండడం వల్ల పూత రాలిపోవడం, తెగుళ్లు సోకడం వంటి కారణాలతో ఈ ఏడాది బంగినపల్లి దిగుబడి లేదు.

ఇతర రకాలు కూడా..

బంగినపల్లితో పాటు ఇతర రకాలు కూడా ఈ ఏడాది ఆశించనంత దిగుబడి ఇవ్వలేదు. మామిడిలో కలెక్టర్‌, నీలం తదితర రకాలు జూలై నెలలో కోతకు వస్తాయి. అవి కాక దేశవాళీ రకాలైన రసాలు, చిన్న రసాలు కాయల కొంతమేర కాసినా అవి రైతులకు అంతగా లాభాలు ఇవ్వలేవు. మామిడి తోటలపై ముందే పెట్టుబడి పెట్టిన వందల మంది లీజు దారులు ఈ ఏడాది తీవ్రంగా నష్టాలు చవి చూశారు. రాజోలు దీవిలో ముంపు సమస్యతో పాటు వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఈ ఏడాది బంగినపల్లితో పాటు ఇతర మామిడి తోటల కాపు గణనీయంగా తగ్గిపోయిందని, ఉప్పునీటి ప్రభావంతో మామిడి తోటలు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు మంచు, ఓఎన్‌జీసీ వంటి సంస్థల గ్యాస్‌ బర్నింగ్‌ వల్ల బూడిద.. కాయల పూతలపై పడి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.

భారీగా నష్టపోయాను

ఈ ఏడాది మామిడి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రైతులకు పెద్ద మొత్తంలో లీజు చెల్లించి, తోటలకు పెట్టుబడి పెట్టి, దిగుబడి కోసం ఎదురు చూశాం. కానీ దిగుబడి మాత్రం దారుణంగా పడి పోయింది. ధర ఉన్నప్పటికీ కాయలు లేవు. భారీగా నష్టాలు చవి చూస్తున్నాం.

– సూరిబాబు, మామిడి పండ్ల వ్యాపారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement