పిఠాపురం రూరల్: మండలంలోని ఎఫ్‌కే పాలేనికి చెందిన జనసేన నాయకుడు పిల్లా శివ పీడబ్ల్యూడీ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడని స్థానిక రైతులు మంగళవారం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాధు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్‌కే పాలెం జంక్షన్ వద్ద జనసేన నాయకుడు పిల్లా శివ పీడబ్లూడీ కాలువను ఆక్రమించి వాణిజ్య షాపులు నిర్మించాడు. షాపులకు వెళ్లటానికి దారి కోసం ఎదురుగా ఉన్న సాగునీరు, ముంపునీరు పోయే కాలువల్లో ఒక దాన్ని పూర్తిగా ఆక్రమించి మట్టితో పూడ్చివేశాడు. రెండో కాలువను ఆక్రమించి చిన్న సైజు తూరలు వేస్తుండగా రైతులందరూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, కాలువను పూడ్చి వేశాడు. దీని వల్ల పంట పొలాలకు నీరు చేరకపోవడంతో పాటు వర్షం కురిస్తే ముంపు నీరు బయటకు వెళ్లని పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
సామర్లకోట: మండల పరిధిలోని హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కోట సత్తిబాబుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. వివరాల్లోకి వెళితే.. సత్తిబాబు మంగళవారం సాయంత్రం హుస్సేన్‌పురం నుంచి ప్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వస్తున్నాడు. అతడిపై టీడీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో సత్తిబాబు తలకు బలమైన గాయమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారిని విడదీసి, పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ సీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, పార్టీ టౌన్ అధ్యక్షుడు పాగా సురేష్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వారా సుధాకర్, బూత్ కమిటీ అధ్యక్షుడు మాగాపు గోపి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ యవర్న శేఖర్.. పోలీసు స్టేషన్‌కు చేరుకుని, క్షతగాత్రుడికి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తిబాబుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కాగా.. వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి తమను గాయపర్చాడని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు చెందిన ఫిర్యాదులు స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో కారు దగ్ధం
కాకినాడ క్రైం: స్థానిక ఆనంద్ థియేటర్ సమీపంలో మంగళవారం ఓ కారులో మంటలు చెలరేగాయి. 2022 మోడల్‌కు చెందిన ఈ కారుకు పిఠాపురానికి చెందిన మాడుగుల బాబూరావు యజమాని కాగా, గరగ అనిల్ కుమార్ అనే వ్యక్తి దాన్ని నడుపుతున్నాడు. గతంలో ఏసీ, రేడియేటర్లు రిపేరు చేయిస్తే అవి పనిచేయకపోవడంతో మరో మారు చూపించేందుకు కారును తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా ఆగిపోవడంతో వారిద్దరూ బయటకు వచ్చి బ్యానెట్‌ను పరిశీలించే లోపే అగ్నికీలలు వ్యాపించి, కారు కాలిపోయింది. సమాచారం అందుకున్న సాలిపేట ఏడీఎఫ్‌వో ఉద్దండురావు సుబ్బారావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.


