వడదెబ్బకు గుర్తు తెలియని ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు గుర్తు తెలియని ఇద్దరి మృతి

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

ట్రాక్టర్‌ ఢీకొని గేదెల కాపరి మృతి

ఆత్రేయపురం: గేదెలు మేపేందుకు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి మార్గం మధ్యలో ట్రాక్టర్‌ ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాలు ఇవీ.. అంకంపాలెం గ్రామానికి చెందిన యడ్ల పెద్ద పల్లయ్య (59) గేదెలు మేపుకోవడానికి మంగళవారం సైకిల్‌పై వెళుతున్నాడు. అంకంపాలెం లంక ఎడమ గట్టు నుంచి కిందకు దిగుతున్న అతడిని, ఎదురుగా అతి వేగంతో వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో పల్లయ్య తలకు బలమైన గాయం కావడంతో వైద్యం కోసం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఆత్రేయపురం ఎస్సై ఎస్‌.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యానాం: యానాంలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం వడదెబ్బకు గురై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్‌ సర్వీస్‌ రోడ్డులోని బళ్ల కాంప్లెక్స్‌ వద్ద సుమారు 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అలాగే యూకేవీ నగర్‌ కమ్యూనిటీ హాలు వద్ద సుమారు 45 ఏళ్ల మరో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వీరిద్దరూ మద్యం తాగడంతో పాటు వడదెబ్బకు గురై మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి, మృతదేహాలను యానాం ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఏఎస్సైలు బడుగు దుర్గారావు, గంజా సత్యనారాయణ తెలిపారు. వారి వివరాలు తెలిసినవారు యానాం పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

ముమ్మిడివరంలో రూ.7 లక్షల చోరీ

ముమ్మిడివరం: స్థానిక బస్టాండ్‌ రోడ్డులోని ఒక ఇంట్లో దొంగలు పడి రూ.7 లక్షలు అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరానికి చెందిన టీడీపీ నాయకుడు జాగు సత్తిబాబు, కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం సమీపంలోని సాయిబాబా ఆలయానికి భోజనాలకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో దొంగల పడి నగదును అపహరించారు. బాధితుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం ఇన్‌చార్జి ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కొత్తపేట: నిబంధనలు పాటించకుండా మట్టిని తోలే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి (డీటీఓ) దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై మట్టి ట్రాక్టర్లు అతి వేగంగా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా సాగించడంపై గత నెల 26న ‘సాక్షి’లో ‘ట్రాక్టర్ల జోరు.. ప్రజలు బేజారు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దానిపై రవాణా శాఖ అధికారులు స్పందించి, తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా సోమ, మంగళవారాల్లో కొత్తపేట మండలం పలివెల – గంటి – ఈతకోట రోడ్డులో తనిఖీలు జరిపి, 8 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, రూ.28,600 అపరాధ రుసుము విధించామని డీటీఓ శ్రీనివాసరావు తెలిపారు. అధిక వేగం, మైనర్‌ డ్రైవింగ్‌, మట్టిపై టార్పాలిన్‌ కప్పకపోవడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫిట్‌నెస్‌ లేకపోవడం, రోడ్డు పన్ను ఎగవేత వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నామని, ఈ తనిఖీలు కొనసాగుతాయని డీటీఓ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement