రెండేళ్ల బాబు పాలనలో విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల బాబు పాలనలో విధ్వంసం

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

అన్ని వర్గాలకూ వెన్నుపోటు పొడిచారు

బాబు వైఫల్యాలను ప్రజల్లోకి

తీసుకువెళ్లండి

‘సర్‌’ కార్యక్రమంపై అప్రమత్తంగా

ఉండాలి

మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు

దాడిశెట్టి రాజా

తుని: రెండేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం తుని పట్టణం మర్చంట్‌ అసోసియేషన్‌ భవనంలో పట్టణ శాఖ పార్టీ అధ్యక్షుడు అన్నవరం శ్రీను, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణాగౌడ్‌ అధ్యక్షతన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్య, సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఫొటో గ్యాలరీ పెట్టామని, అందరూ చూసి నిజాలు గ్రహించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హులకు ఉద్యోగాలు దక్కలేదన్నారు. చివరకు పరీక్ష రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులను తెలుసుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని భరోసా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జననేత జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చారని, తద్వారా మార్కెట్‌లో ఆ సొమ్ము చలామణీ అయ్యి కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో తెచ్చిన అప్పులు ప్రజలకు కాకుండా బినామీలకు దోచిపెట్టారని విమర్శించారు. ప్రతి మహిళకు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ.లక్ష వరకు లబ్ధి చేకూరడంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకున్నారన్నారు. ఇప్పుడు ప్రజల చేతిలో చిల్లిగవ్వ లేదని, కూటమి ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో తెలుసుకున్నారని, ప్రజల్లో తిరుగబాటు ప్రారంభమవుతుందన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి చేపట్టనున్న సర్‌ కార్యక్రమం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఓట్లు తొలగించే కుట్రలు చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మహిళల ఓట్లు తొలగించడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డెత్‌ సర్టిఫికెట్‌ కావాలంటే రూ.12 వేలు చెల్లించి రోజుల పాటు తిరగాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.24 చెల్లిస్తే బాధితుడు ఇంటికి నేరుగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు చింతల సునీత, అనుబంధ విభాగాల నాయకులు బోడపాటి సతీష్‌, సిద్ధా శ్రీను, పోతల రమణ, బుచ్చిరాజు, రమేష్‌, సత్య జగదీష్‌, మోహన్‌, విద్యార్థులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement