ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారని ఇసుకపల్లి గ్రామస్తుల ఆందోళన
కొత్తపల్లి: అధిక లోడుతో, మితిమీరిన వేగంతో మట్టి లారీలు రాత్రీ పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి లారీలను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. పిఠాపురం వైపు నుంచి ఇసుకపల్లి మీదుగా వెళుతుండడంతో గ్రామంలో ఉన్న వారికి కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు. అధిక లోడుతో వెళ్లడం వల్ల రోడ్డుపై గోతులు ఏర్పడుతున్నాయని, అధికలోడుతో పాటు లారీల వేగానికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, ప్రహరీ బీటలు వారుతున్నాయని చెప్పారు. లారీల నుంచి మట్టిపడి రోడ్లపై దుమ్ము రేగుతోంది. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్ధితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మట్టి మాఫియా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మమ్మల్ని ఆపేది ఎవడురా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మట్టిలోడుతో ప్రజలను భయపెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం లారీ టైరు ఊడిపోయి రామాలయాన్ని ఢీకొట్టింది. దీంతో రామాయంలో పడుకున్న భభక్తులు భీతావహులయ్యారు. లారీలు అతివేగంగా రోడ్లపై తిరగడం వలన గత 15రోజులుగా పిల్లలను బయటకు పంపాలంటే భయపడే పరిస్ధితి ఏర్పడుతోందన్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గ్రామం మీదుగా ఒక్క లారీని కూడా తిరగనివ్వబోమని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.


