నేలకోట ఆవలో పులి సంచారం | - | Sakshi
Sakshi News home page

నేలకోట ఆవలో పులి సంచారం

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

అటవీ శాఖ అధికారుల అప్రమత్తం

మత్తు మందు ఇచ్చి

పట్టుకునేందుకు యత్నాలు

దేవీపట్నం: మండలంలో పులి కోసం వేట కొనసాగుతోంది. రామదుర్గం కొండపై ఆదివారం తిష్ట వేసిన పులి రాత్రికి నేలకోట, పురుషొత్తపట్నం రహదారిని దాటుకుని నేలకోట రామవరపు ఆవ వద్ద కొండపైకి చేరింది. ఈ కొండకు ఉత్తరాన ఆవ, దక్షిణాన సీతానగరం మండలం పెద కొండేపూడి, చీపురుపల్లి తదితర గ్రామాలు ఉన్నాయి. కొండకు కొద్దిపాటి దూరంలో సీతానగరం చిట్టిబాబా ఆశ్రమానికి చెందిన గోశాల ఉండడం, ఇది వరకు ఆ గోశాల వరకూ పులి సంచరించిన ప్రాంతం కావడంతో కొండకు ఇరువైపులా అటవీ అధికారులు మోహరించారు. పోలవరం డీఎఫ్‌ఓ రామచంద్రరావు నేతృత్వంలో రెస్క్యూ బృందాలు పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొండలపై ఉన్నంత వరకూ పులి మెడకు అమర్చిన ట్రాకర్‌, డ్రోన్‌ కెమెరాలతో పులి గమనాన్ని పరిశీలిస్తున్న అధికారులు పులికి మత్తు మందు ఇచ్చే అనువైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నారు. మైదాన ప్రాంతమైన సీతానగరం మండలం వైపు పులి పయనిస్తే పులికి మత్తు మందు ఇవ్వడం సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా సీతానగరం మండలంలో సరిహద్దు గ్రామాలు, దేవీపట్నం మండలంలోని నేలకోట, గండికోట, అంగుళూరు తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

సీతానగరం మండల పరిధిలో పులి సంచారం

సీతానగరం: మండల పరిధిలోని పురుషోత్తపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సోమవారం ఉదయం జీపీఎస్‌ ట్రాకింగ్‌తో పులి దేవిపట్నం మండలం నేలకోట, సీతానగరం మండల పరిధిలోగల రామదుర్గం కొండ, రామరపు ఆవ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి దేవీపట్నం మండల పరిధిలో 14 పశువులను చంపి, సోమవారం సీతానగరం మండల పరిధిలోని కొండలు, పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. దీనితో నాగంపల్లి, చీపురుపల్లి, అచ్చయ్యపాలెం, చినకొండేపూడి, పెందకొడేపూడి గ్రామాల ప్రజలతోపాటు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ఎ శ్రీనివాస్‌ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement