బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూలు ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సంఘ జిల్లా కన్వీనర్ చంద్రమళ్ల పద్మ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూలు ఆయాలు, స్కూల్ నైట్ వాచ్‌మన్‌లు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ చంద్రమళ్ల పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ స్కూల్లో నైట్ వాచ్‌మన్‌గా పని చేసే కార్మికులకు ఇచ్చే రూ.ఆరువేల జీతం 6 నెలలుగా బకాయి పెడితే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. స్కూలు ఆయాలకు ఇచ్చే రూ.6 వేలు జీతంతోనే చీపుర్లు, ఫినాయిల్ ఇతర సామగ్రి కొనుగోలు చేయాలనడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికుల ఉపాధికి చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెడుతోందని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, మునికాంత, లక్ష్మీ, కాదా కుమారి, వెంకటరమణ, రవణమ్మ, వెంకటలక్ష్మీ, లోవరాజు, వీర్రాజు పాల్గొన్నారు.


