గిట్టుబాటుకు పోటు! | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటుకు పోటు!

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

కోలుకోని వర్జీనియా పొగాకు మార్కెట్‌

వేలం కేంద్రాలకు చేరుకోని బేళ్లు

గిట్టుబాటు లేక నలిగిపోతున్న రైతులు

దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు దాటినా గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు పడ్డారు. అంతర్జాతీయ సంక్షోభంతో కొనుగోళ్లు మందగించినట్టు అధికారులు చెప్తున్నారు. వేలానికి తీసుకువచ్చిన బేళ్లను నాణ్యత లేదని కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారని, కనీసం 50 శాతం కూడా అమ్ముడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు సైతం రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నాడు. తప్పేది లేక వారంతా బయట దళారుల వద్దే వారు చెప్పిన ధరకే పొగాకు విక్రయించి వదిలించుకుంటున్నారు.

రంగు మారుతున్న పొగాకు

గ్రేడింగ్‌ పూర్తిచేసి, బేళ్లు కట్టిన పొగాకు ఇటీవలి ఎండల తీవ్రతకు రంగు మారిపోతోంది. రంగు మారితే కొనుకోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటి నాలుగు రెలుపుల పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోలు చేయనిపరిస్థితి ఏర్పడింది.

రూ. 71.39 కోట్ల విక్రయాలు

టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.71.39 కోట్ల విలువైన 27.57 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కొనుగోళ్లు ప్రారంభించి 73 రోజులు కాగా, 46 రోజులు వేలం జరిగింది. 2025–26 పంట కాలానికి 12,938 మంది రైతులు, 30,145 హెక్టార్లలో సుమారు 85 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి చేశారు. బోర్డు నిర్దేశించిన పరిమాణం కంటే అదనంగా సుమారు 35 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి జరిగినట్టు గణాంకాలు చెపుతున్నాయి.

నిలకడగా పొగాకు ధర

మార్కెట్లో పొగాకు ధర నిలకడగా సాగుతుంది. కిలో గరిష్ఠ ధర రూ.260, కనిష్ఠ ధర రూ.180, సగటు ధర రూ.258.95కి విక్రయిస్తున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. సగటు ధర కిలో రూ.320 ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పొగాకు గరిష్ట ధర రూ.265 కాగా,

కొనుగోళ్లు, సగటు ధరలు ఇలా ఉన్నాయి..

వేలం కేంద్రం కొనుగోలు సగటు ధర (కిలోల్లో)

దేవరపలి 387674 256.70

జంగారెడ్డిగూడెం–1 723158 259.64

జంగారెడ్డిగూడెం–2 539732 260.23

కొయ్యలగూడెం 532183 258.37

గోపాలపురం 574468 258.93

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

పొగాకు వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలం కేంద్రాలకు వస్తున్న ట్రేడర్లు మొక్కుబడిగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.

తక్కువ బేళ్లు వేలానికి వస్తున్నాయి

వేలం కేంద్రానికి తక్కువ బేళ్లు వస్తున్నాయి. మొదటి రెలుపుల ఆకులు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడంలేదు. కర్ణాటకలో వేలం జరుగుతున్నందున ట్రేడర్లు ఇక్కడకు రాలేదు. ఎగుమతి ఆర్డర్లు కూడా రావలసి ఉంది.

– పి.హేమస్మిత, వేలం కేంద్రం నిర్వహణాధికారిణి,

దేవరపల్లి

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

పొగాకు మార్కెట్‌ సంక్షోభంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కలు గజేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయాలి. ప్రభుత్వమే మార్క్‌ ఫెడ్‌ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ రూ. 500 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి ఆదుకున్నారు. రైతులకు అండగా వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుంది.

– వల్లభనేని సత్యనారాయణ,

వైఎస్సార్‌ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement