పసి ప్రాణం తీయకు! | - | Sakshi
Sakshi News home page

పసి ప్రాణం తీయకు!

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

పసిప్రాణానికి మధుమేహ గండం

పిల్లల్లో విస్తరిస్తున్న వ్యాధి లక్షణాలు

పసి దేహాలకు నిత్యం ఇన్సులిన్‌ తూట్లు

తాజాగా బాలిక మృతితో అప్రమత్తం

జిల్లాలో 20 వేల మందికి పైనే వైద్యం

కాకినాడ క్రైం: పసి ప్రాయాన్ని మధుమేహం కబళిస్తోంది. వంశపారంపర్యంగా కొందరికి, ఆహారంలో అలవికాని పదార్థాల దుష్ప్రభావాలు శరీర వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయి. మనిషి శరీరానికి అవసరమనన గ్లూకోజ్‌ను కణాల్లోకి పంపడానికి అవసరమయ్యే ఇన్సులిన్‌ సరిపడా లేకపోవడమే మధుమేహం (డయాబెటిస్‌). ఈ పరిస్థితి నేడు ఎందరో చిన్నారుల్లో కనిపిస్తోంది.

చిన్నపిల్లల్లో వస్తే...

చిన్న పిల్లల్లో వచ్చే మధుమేహాన్ని టైప్‌–1 డయాబెటిస్‌ అంటారు. పెద్ద వారిలో కనిపించేది టైప్‌–2. పిల్లల శరీరంలో ఇన్సులిన్‌ తయారు చేసే పాంక్రియాస్‌ కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. పిల్లల్లో టైప్‌–2 డయాబెటిస్‌ కూడా గుర్తిస్తారు. ఊబకాయం, జంక్‌ఫుడ్స్‌, వారసత్వ కారణాలు ఈ పరిస్థితికి దోహదపడతాయి. టైప్‌–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తప్ప ప్రత్యామ్నాయం లేదు. డయాబెటిస్‌ వల్ల తీవ్ర దాహం, అలసట, నీరసం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, బరువు తగ్గిపోవడం, కంటి చూపు మందగించడం వంటి ఎన్నో దుష్ప్రభావాలు దీనివల్ల ఎదురవుతుంటాయి.

తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం..

పిల్లల్లో డయాబెటిస్‌ తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకమే. రెండేళ్ల వయసు పిల్లల్లోనూ టైప్‌–1 డయాబెటిస్‌ ఉంటుంది. ఇటువంటి పిల్లలకి ప్రతి రోజు తల్లిదండ్రులే తమ చేతితో సూది పొడిచి కన్నబిడ్డ సూది నొప్పికి తల్లడిల్లిపోతే కన్నీళ్లు పెట్టుకుంటారు.

మధుమేహంతో బాలిక మృతి..

తొండంగి మండలం, రావికంపాడు గ్రామానికి చెందిన మేడిశెట్టి కామేశ్వరి అనే 16 ఏళ్ల బాలిక మధుమేహం ముదిరి స్థానిక జీజీహెచ్‌లో ప్రాణాలు విడిచింది. సుగర్‌ స్థాయిలు పెరిగి సెప్సిస్‌ షాక్‌కు గురైంది.

దేహంలో ఇన్‌ఫెక్షన్‌ లోయర్‌ రెస్పిరేటరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ (ఎల్‌ఆర్‌టిఐ)కు కారణమైంది. ఇది బాలిక మృతికి దారితీసింది. జీజీహెచ్‌, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ లక్షణాలతో 20 వేలకు పైగా చిన్నారులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. పిల్లలకు చికిత్స చేసేందుకు ప్రభుత్వాస్పత్రుల్లో ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకపోవడం శోచనీయం.

కేసులు గణనీయంగా పెరిగాయి

పిల్లల్లో మధుమేహం ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఈ కేసులు గణనీయంగా పెరిగాయి. కోవిడ్‌ తర్వాత ఈ పరిస్థితి ఎదురైంది. శరీరాన్ని హాని కారకాల నుంచి రక్షించే రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణాలు, కణజాలాలు, అవయవాలపై దాడి చేసే ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ ఇది. దీనికి నియంత్రణ ఒకటే మార్గం. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డయాబెటిక్‌ కీటో ఎసిడోసిస్‌ (డీకెఏ) స్థితికి చేరి ప్రాణాంతకం కావచ్చు.

– డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ భీమాల,

ఎండోక్రైనాలజిస్టు, డయాబెటాలజిస్టు, కాకినాడ

జాగ్రత్తలు ఇవే..

పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వాలి. రోజూ తాజా పండ్లు, కూరగాయాలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు తినే అలవాటు చేయాలి. చక్కెర ఎక్కువగా ఉంటే శీతల పానీయాలు, ప్యాకేజ్డ్‌ జ్యూస్‌లు, స్వీట్లు, జంక్‌ ఫుడ్‌ పూర్తిగా మానేయాలి. రోజులో కనీసం ఒక గంట శారీరక వ్యాయామం, ఆటలు ఆడేలా చూడాలి. టీవీ, మొబైల్స్‌ చూస్తూ, వీడియోగేమ్స్‌ ఆడుతూ ఆహారం తినే అలవాటు మాన్పించాలి. పిల్లలు వయసుకు తగ్గ బరువు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. సరిపడ నిద్ర పోవాలి. కుటుంబంలో ఎవరికై నా డయాబెటిస్‌ ఉంటే అటువంటి పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement