వందిమాగధులకూ వంగి వంగి..! | - | Sakshi
Sakshi News home page

వందిమాగధులకూ వంగి వంగి..!

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

కొరత వేళ సత్యదేవుని సంప్రదాయ

కండువాల దుర్వినియోగం

ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు

ప్రొటోకాల్‌ కానివారికీ సత్కారం

ఈ సారి ఎవరిని బాధ్యులను చేయనున్నారో!

అన్నవరం: అయితే అతివృష్టి లేదా అనావృష్టి.. ఈ సామెత అన్నవరం దేవస్థానం అధికారులకు సరిగ్గా సరిపోతుందేమో! పై చిత్రం చూడండి.. మధ్యలో ఉన్నవారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. సత్యదేవుని దర్శనానికి వచ్చిన ఆమెకు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ప్రొటోకాల్‌ ప్రకారం ఘనంగా స్వాగతం పలికి స్వామివారి కండువా వేసి ప్రసాదాలు ఇచ్చి గౌరవించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఆమెతో వచ్చిన ఒకరిద్దరు పదవుల్లో ఉన్నవారిని మినహాయిస్తే మిగిలిన టీడీపీ శ్రేణులకు సైతం స్వామివారి కండువాలు వేయడం కచ్చితంగా అభ్యంతరకరమే. పాలక పార్టీపై కొంత మర్యాద ఉండవచ్చు కానీ.. మరీ ఇంత దుర్వినియోగం అయ్యేంత అవసరమా అని భక్తులు చర్చించుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే స్వామివారి సంప్రదాయ కండువాలు ఇవ్వడం లేదన్న విషయం వివాదాస్పదమైన తరువాత కూడా ఇలా కండువాల సంతర్పణ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

15 రోజులుగా సత్యదేవుని నామం, శంఖుచక్రాలు ముద్రించిన కండువాలు లేకపోవడంతో సాధారణ కండువాలను స్వామివారి కల్యాణం, రూ.1,500, రూ.2 వేల వ్రతాల చేయించుకుంటున్న భక్తులకు ఇవ్వడంతో వారు అసంతృప్తి చేశారు. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘నీ నామమెంతో రుచిరా!’ శీర్షికన ఈ నెల నాలుగో తేదీన కథనం ప్రచురించడం, దీనిపై స్పందించిన అధికారులు కండువాల టెండరుదారును బాధ్యుడిని చేస్తూ ప్రకటన చేయడం, సంప్రదాయ కండువాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడం తెలిసిందే. అంతటితో ఆగక కండువాల సరఫరా సక్రమంగా జరగకపోవడానికి బాధ్యులుగా గుర్తించి సంబంధిత సూపరింటెండెంట్‌, గుమాస్తాలను వేరే సెక్షన్లకు బదిలీ చేసిన ఈఓ నల్లం సూర్యచక్రధర్‌రావు అనంతరం వారిపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు.

ఇంత తతంగం జరిగాక కూడా కనీస నిల్వగా ఉన్న స్వామివారి కండువాలను అత్యంత పొదుపుగా వినియోగించాల్సి ఉండగా ఇష్టమొచ్చినట్టు సంతర్పణలా వినియోగించడం శోచనీయం. స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీల తగురీతిన సత్కరించడంలో తప్పులేదు. కానీ వారి వందిమాగధులకు కూడా వేసేసి సదరు వీఐపీ మెప్పు పొందాలనుకున్నపుడే తంటంతా. ఈ విధానానికి అధికారులు స్వస్తి పలకాల్సి ఉంది. తాజా సంప్రదాయ కండువాల దుర్వినియోగానికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారో.. అలా వేయాలని నిర్ణయం తీసుకున్నదెవరో సత్యదేవునికే ఎరుక.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement