జీజీయూలో తెలుగు మహాసభ ప్రారంభం
రాజానగరం: మాతృ భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. వెలుగుబంద సమీపంలోని జీజీయూలో చైతన్య సారస్వత్ పరిషత్, శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. చైతన్యరాజు మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తారని, అందుకే మాతృ భాష పరిరక్షణలో తల్లిదండ్రులే ముందుండాలన్నా రు. తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించడంతో పాటు ప్రతి ఇంటా మాతృభాషలోనే మాట్లాడుకోవాలన్నారు. ఈ ఉద్దేశంతోనే మూడేళ్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాదు జీజీయూ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యతో పాటు తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టామన్నారు. శ్రీశ్రీ కళావేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రాచీన కవులు, కళాకారుల సాహిత్యాన్ని యువతరానికి అందించడం సాహిత్య సంస్థల బాధ్యతన్నా రు. ఇదేవిధంగా తెలుగు సాహిత్య మహాసభలను శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జూలైలో కాకినాడ, ఆగస్టులో హైదరాబాద్ – రవీంద్రభారతి, సెప్టెంబర్‌లో మలేషియాలో నిర్వహించనున్నామన్నారు. అనంతరం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏపీ రక్షణ దళం కమాండెంట్ కొండా నరసింహరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ప్రముఖ సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, శ్రీశ్రీ కళావేదిక జాతీ య అధ్యక్షుడు జి.ఈశ్వర భూషణం పాల్గొన్నారు.


