ఇక కిక్‌నిక్‌ స్పాట్లేనా! | - | Sakshi
Sakshi News home page

ఇక కిక్‌నిక్‌ స్పాట్లేనా!

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

10 లో

ఉప్పాడ సాగర తీరం

త్వరలో బీచ్‌లలో మద్యం విక్రయాలు

బీచ్‌ షాక్స్‌ పేరిట చంద్రబాబు

సర్కారు పచ్చజెండా

పర్యాటకులను ఆకర్షించే ముసుగులో మత్తులో ముంచే యత్నం!

ఇదే అదనుగా అసాంఘిక శక్తులు చెలరేగే ప్రమాదం

ఇకపై ఫ్యామిలీతో బీచ్‌కు

వెళ్లాలంటే ఇబ్బందే!

పిఠాపురం: కనుచూపు మేరంతా అపార నీలి జలరాశి.. మనసుకు ఆహ్లాదాన్నిచ్చేలా ఉప్పొంగుతూ ఎగసిపడే కెరటాల హోరు.. మెత్తని ఇసుక తిన్నెలతో కూడిన సాగర తీర అందాలు సందర్శకులను ఎంతో పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతాలు పిక్నిక్‌లకు సైతం నెలవు. చంద్రబాబు సర్కారు పుణ్యమా అని.. ఇటువంటి పిక్నిక్‌ స్పాట్లు.. ఇకపై ‘కిక్‌’నిక్‌ స్పాట్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటకాభివృద్ధి ముసుగులో.. రాష్ట్రంలోని పలు బీచ్‌లలో.. గోవా తరహాలో మినీ బార్లు, లిక్కర్‌ షాపులు (బీచ్‌ షాక్స్‌) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ‘పచ్చ’జెండా ఊపింది. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. రెండో దశలో కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుకు ఎకై ్సజ్‌ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వీటికి అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే సాగర తీరంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే సాధారణ పర్యాటకులకు, పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతో కలసి ఆహ్లాదంగా గడపడానికి వచ్చే వారికి ఇక నుంచి ఇబ్బందులు మొదలు కానున్నాయి. సరదాగా గడుపుదామని బీచ్‌కు వస్తే.. మందుబాబుల చిందులతో చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతే కాదు.. అందాల సాగర తీరం అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

అభివృద్ధిని కడలిలో కలిపేసి..

జిల్లావ్యాప్తంగా కాకినాడలో మాత్రమే బీచ్‌ ఉండగా మరో 21 బీచ్‌ల అభివృద్ధికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో దేశంలో 10 బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లుండగా.. వాటిలో విశాఖ రుషికొండ బీచ్‌ ఒకటి. అలాంటి బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ను కాకినాడలో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సేవలు, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతాయని భావించారు. ఈలోగా ఎన్నికలు రావడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీచ్‌ల అభివృద్ధి కడలిలో కలిసిపోయింది. కాకినాడ వద్ద బీచ్‌ పార్కు, బీచ్‌ రోడ్డు, అద్దరిపేట సాగరతీరం, పంపు హౌస్‌లు పిక్నిక్‌ స్పాట్లుగా వెలుగొందుతున్నాయి. అలాగే, కాకినాడ సమీపాన సముద్రం మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన హోప్‌ ఐలాండ్‌ కూడా మంచి పిక్నిక్‌ స్పాట్‌గా ఉంది. ఇక్కడకు వెళ్లేందుకు కాకినాడ హార్బర్‌, కోరంగి మడ అడవుల నుంచి సౌకర్యాలున్నాయి. అలాగే, తాళ్లరేవు మండలంలోని కోరంగి మడ అడవుల అందాలు కూడా పర్యాటకులను కట్టిపడేస్తూంటాయి. వీటితో పాటు మరిన్ని ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో పర్యాటక రంగానికి, బీచ్‌ల అభివృద్ధికి రెండేళ్లుగా ఒక్క పైసా కూడా విదల్చని సర్కారు.. కేవలం ఆదాయమే లక్ష్యంగా.. బీచ్‌లను మందుబాబులకు నిలయాలుగా మార్చేందుకు చేస్తున్న యత్నాలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పూటుగా మద్యం తాగి.. ఆ మత్తులో మందుబాబులు గొడవలకు, అసాంఘిక కార్యకలాపాలకు దిగితే.. మహిళలు, పిల్లల భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రకృతిని వికృతంగా మారుస్తారా?

సముద్రం ఒడ్డున మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం బాధాకరం. ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు. రేపు కాకినాడకు తీసుకువస్తారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో మందుబాబుల ఆగడాలు పెరుగుతున్నాయి. ఇక బార్లు తెరిస్తే ఈ ప్రాంతాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారే ప్రమాదముంటుంది. దీనివలన బీచ్‌కు వచ్చే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముంటుంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

– ఎన్‌.సూర్యనారాయణ, మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్‌, పిఠాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement