యనమలకు మరోసారీ | - | Sakshi
Sakshi News home page

యనమలకు మరోసారీ

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

రాజ్యసభకు సానా కొనసాగింపు చినబాబు కోటరీకే పెద్దపీట

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆవిర్భావం నుంచీ టీడీపీ విధివిధానాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడుకు చంద్రబాబు మరోసారి హ్యాండిచ్చారు. తుని నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న యనమల ఆర్థిక మంత్రి, అసెంబ్లీ స్పీకర్‌, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ వంటి అనేక కీలక పదవులు అధిష్టించారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్‌–2 స్థానంలో ఉన్నట్టు చెప్పుకొనేవారు. అటువంటిది రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ హవా మొదలైన తరువాత వరుస ఓటములతో యనమల చాలా కాలం క్రితమే ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్‌బై చెప్పేశారు. ఢిల్లీలో పెద్దల సభలో అడుగు పెట్టడం ఇప్పటి వరకూ ఆయనకు రాజకీయంగా తీరని కల. ఒక్కసారైనా రాజ్యసభ సభ్యుడు కావాలని ఆశ పడ్డారు. దీని కోసం చాన్నాళ్లుగా ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఆయన ఆశలు పెట్టుకోగా భంగపాటే ఎదురైంది. మన రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి కేటాయించారు. ఈ నాలుగింటిలో ఒక స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడకు చెందిన సానా సతీష్‌బాబును మరోసారి కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో, టీడీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న యనమల రాజకీయ భవిష్యత్తుకు ఇక మంగళం పాడేసినట్టేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సీనియర్లకు పొగ

ఒకప్పుడు టీడీపీలో సీనియర్లకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. అటువంటిది ప్రస్తుతం పొమ్మనకుండానే సీనియర్లకు పొగ పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఆ పార్టీలో చినబాబు టీమ్‌దే పై చేయిగా ఉంటోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు కాకినాడ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సానా సతీష్‌బాబు.. సతీష్‌ ఫౌండేషన్‌ పేరిట అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాకినాడలో ఏపీ ఈపీడీసీఎల్‌ ఇంజినీర్‌గా తెలిసిన ఆయన.. టీడీపీలో అనతి కాలంలోనే చినబాబు లోకేష్‌ కోర్‌ టీమ్‌లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ముద్ర పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఫండింగ్‌, రాష్ట్ర స్థాయి ప్రచార కార్యక్రమాలతో చినబాబుకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు ప్రయత్నించారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. అనంతరం, చినబాబు ఆశీస్సులతో సతీష్‌ అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మరోసారి కొనసాగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పెద్దల సభ అయిన రాజ్యసభకు రాజకీయాల్లో ఆరితేరిన ఉద్దండులకు మాత్రమే ఒకప్పుడు అవకాశం దక్కేది. వయస్సు, అనుభవం, పార్టీ అధిష్టానంపై వీరవిధేయత, బీసీ సామాజికవర్గం వంటి సానుకూల అంశాలున్నప్పటికీ.. తాజా రాజ్యసభ సీట్ల భర్తీలో యనమల పేరును కనీసంగా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీనినిబట్టి పార్టీలో ఇకపై సీనియర్లకు చోటు లేదు, దక్కదనే సంకేతాలు పంపుతున్నట్టేనని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. యనమల వంటి సీనియర్‌నే పూర్తిగా పక్కన పెట్టేసి, నిన్న కాక మొన్న వచ్చిన వారికి అగ్రాసనం వేశారంటే.. ఇక తమ స్థానం ప్రశ్నార్థకమేనని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ సీనియర్‌ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. బలహీన వర్గాలు తన గుండెల్లో ఉన్నారని పదేపదే ఘనంగా చెప్పుకొనే చంద్రబాబు ప్రకటనలు వట్టి మాటలుగానే తేలిపోయాయని టీడీపీలోని బీసీ నేతలు అంటున్నారు.

ఒక్కటవుతున్న శత్రువులు!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేందుకు రాజ్యసభ సభ్యత్వంపై టీడీపీలో తాజా జరుగుతున్న రచ్చే నిదర్శనంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా టీడీపీలో సీనియర్లయిన యనమల, టీటీడీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయాల్లో ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేవారు. అటువంటి ఈ ఇద్దరినీ సానా సతీష్‌ రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు ఆలోచన ఏకం చేసిందనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ సీటును తన తనయుడు నవీన్‌కు దక్కించుకునేందుకు జ్యోతుల నెహ్రూ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, వాటికి చెక్‌ పెట్టేలా సతీష్‌ వర్గం ప్రయత్నించిందని టీడీపీ నేతలు అప్పట్లో బాహాటంగానే చెప్పుకున్నారు. అప్పటి నుంచీ జిల్లా పార్టీలో జ్యోతుల, సానా వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రి లోకేష్‌ కాకినాడ పర్యటనలో ఇరు వర్గాలూ బలప్రదర్శనకు దిగాయి. వచ్చే ఎన్నికల్లో తన తనయుడు నవీన్‌ జగ్గంపేట నుంచి, తాను జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తామని కొన్నాళ్ల కిందట నెహ్రూ చేసిన ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపింది. ఇప్పుడు రాజ్యసభ సీటు విషయంలో యనమలను పక్కన పెట్టిన నేపథ్యంలో నెహ్రూ, యనమల వర్గాలు చేతులు కలుపుతున్నాయనే చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement