పేదల స్థలాలను పరిశ్రమలకివ్వడం తగదు | - | Sakshi
Sakshi News home page

పేదల స్థలాలను పరిశ్రమలకివ్వడం తగదు

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

తుని రూరల్‌: పెద్దాపురం రామేశ్వరం మెట్ట వద్ద పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం జిందాల్‌ పరిశ్రమకు కేటాయించడాన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్‌.అన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయనను వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబా బు తదితరులు శనివారం కలిశారు. రామేశ్వరం మెట్ట స్థలాల సమస్యను వివరించారు. రాజా మాట్లాడుతూ, అవసరమైతే లబ్ధిదారులతో కలసి జిల్లా కేంద్రంలో పోరాటాన్ని ఉధృతం చేద్దామని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాడాల్సిందేనని దొరబాబుకు సూచించారు. పేదల ఇళ్ల స్థలాల పరిరక్షణ కోసం జరిగే ఎటువంటి కార్యక్రమానికైనా అండగా నిలుస్తానని చెప్పారు.

ముగిసిన వేసవి

విజ్ఞాన శిక్షణ శిబిరం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన 45 రోజులుగా జరిగిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భూపతిరాజు ఈశ్వరరాజువర్మ (సాయిబాబు రాజు), కార్యదర్శి కేజేఎస్‌ఎల్‌ కుమారి చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు పసుపులేటి పాసయ్య, ఉప గ్రంథాలయ ఇన్‌చార్జి అధికారి కె.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

భక్తజన సంద్రమైన రత్నగిరి

అన్నవరం: వేలాదిగా భక్తులు తరలిరావడంతో రత్నగిరి శనివారం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. మొత్తం 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.

ఆగస్టులో కృత్రిమ చేతుల

అమరిక శిబిరాలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యాన రోటరీ సహకారంతో ఆగస్టు 2న గుంటూరు, అదే నెల 10న విజయనగరంలో కృత్రిమ చేతుల అమరిక శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ వైడీ రామారావుతో కలసి కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ కలెక్టరేట్‌లో శనివారం ఆవిష్కరించారు. చేతులు కోల్పోయిన అర్హులైన దివ్యాంగులకు ఈ శిబిరాల్లో రూ.30 వేల విలువైన ఎల్‌ఎన్‌–4 హ్యాండ్‌ సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ చేతులను పూర్తి ఉచితంగా అమరుస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్‌, ఇతర వివరాలకు కాకినాడ రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో లేదా 89857 70583 నంబరులో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్‌ వై.కల్యాణ్‌ చక్రవర్తి కూడా పాల్గొన్నారు.

విస్తారంగా వర్షం

తుని రూరల్‌: మండలంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈదురు గాలులతో కురిసిన వర్షం ప్రజలకు ఊరటనిచ్చింది. ఎస్‌.అన్నవరం, గెడ్లబీడు, జగన్నాతగిరి, తాళ్లూరు, రేఖవానిపాలెం తదితర గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు సేద తీరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement