స్టాంపులు అయిపోయాయి | - | Sakshi
Sakshi News home page

స్టాంపులు అయిపోయాయి

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

కాకినాడ లీగల్‌: జిల్లాలోని 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపుల కొరత వేధిస్తోంది. వీటిల్లో 7 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నోటరీ స్టాంపులు అందుబాటులో లేవు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, సర్పవరం, తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం, తాళ్లరేవు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయలున్నాయి.

కాకినాడ, సర్పవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపులకు కొన్ని నెలలుగా కొరత ఏర్పడింది. దీంతో, కక్షిదారులు, న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు.

నోటరీ, కోర్టులో దాఖలు చేసే వివిధ పత్రాలు, రిజిస్ట్రేషన్ల వంటి ఏ లావాదేవీలు జరపాలన్నా ఆయా స్టాంపులు ఎంతో అవసరం. కొన్నాళ్లుగా అవి లభ్యం కాకపోవడం అందరికీ ఇబ్బందికరంగా మారింది.

నోటరీ స్టాంపులు

సర్పవరం, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం, తాళ్లరేవు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సుమారు ఆరు నెలలుగా నోటరీ స్టాంపుల కొరత ఉంది. కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సుమారు 6 నెలలగా నోటరీ స్టాంపులు లేవు. దీనిపై ఉద్యోగులను అడగ్గా వెంటనే 20 వేల నోటరీ స్టాంపులు తెచ్చారు. అవి వచ్చి రెండు మూడు రోజులైనప్పటికీ వాటి అమ్మకాలు మాత్రం జరపడం లేదు. నోటరీ స్టాంపు ధర రూ.5. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు, చేర్పులకు, లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్‌ అగ్రిమెంట్లు.. ఇలా ప్రతి దానికీ నోటరీ తప్పనిసరి. అటువంటి స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో నోటరీ న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి నోటరీ చేస్తున్నారు.

కోర్లు ఫీ స్టాంపులు

కోర్టుల్లో ఏ పత్రాలు దాఖలు చేయాలన్నా, ఏ పత్రాలు పొందాలన్నా అటు కక్షిదారులకు, ఇటు న్యాయవాదులకు కోర్టు ఫీ స్టాంపులు తప్పనిసరి. రూ.1, రూ.2, రూ.5, రూ.10 డినామినేషన్‌ కోర్టు ఫీ స్టాంపులు రెండు నెలలుగా లభించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

రెవెన్యూ స్టాంపులు

అద్దె చెల్లింపులు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకు లావాదేవీల వంటి వాటిల్లో నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఆయా రసీదులపై రెవెన్యూ స్టాంపులు అంటిస్తూంటారు. దీని ధర ఒక రూపాయి. కాకినాడ, సర్పవరంతో పాటు పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ స్టాంపులకు ఏడాది నుంచి కొరత ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు.

నాసిక్‌ నుంచి రావాలి

నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపులు, నాన్‌ జ్యుడీషియల్‌, ఇతర స్టాంపులు నాసిక్‌లోని ముద్రణాలయంలో ముద్రిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఇండెంట్‌ను బట్టి అక్కడి నుంచే ఈ స్టాంపులు వస్తాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత స్టాంపుల లభ్యతపై సకాలంలో స్పందించడం లేదు. దీంతో, తరచూ స్టాంపుల కొరత సమస్య తలెత్తుతోంది. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ఆదాయం తీసుకోవడమే తప్ప.. ఆ శాఖకు కావలసిన స్టాంపులు, వసతుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం అవసరమైన స్టాంపులకు వెంటనే ఇండెంట్‌ పెట్టి, త్వరితగతిన వచ్చే ఏర్పాట్లు చేయాలని న్యాయవాదులు, కక్షిదారులు కోరుతున్నారు.

ఫ అందుబాటులో లేని నోటరీ,

కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపులు

ఫ లావాదేవీలకు ఇబ్బందులు

ఫ కక్షిదారులు, న్యాయవాదులకు అవస్థలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement