● కుంతీమాధవ స్వామి కోనేరులో
బర్త్‌డే వేడుకలా?
● జనసేన నాయకులపై
విశ్వ హైందవ పరిషత్ ఆగ్రహం
● సంప్రోక్షణ చేయాలని డిమాండ్
పిఠాపురం: కుంతీమాధవ స్వామి పవిత్ర కోనేటిలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన జనసేన నాయకులు సనాతన ధర్మాన్ని మంటగలిపారని, తీవ్ర అపచారానికి ఒడిగట్టారని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. స్వామి వారి కోనేటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన జనసేన నాయకులు.. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా శుక్రవారం కేక్ కటింగ్ వంటి అపచారాలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కుంతీమాధవ స్వామి వారి కోనేటి వద్ద పరిషత్ నాయకులు శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మానికి విలువనిస్తున్నట్టు ఒకవైపు చెప్పుకొంటూంటే.. ఆ పార్టీ నాయకులే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం దారుణమని మండిపడ్డారు. దేవాలయ ఆచార సంప్రదాయాలు, హిందూ ధార్మిక విధానాల ప్రకారం దేవస్థానం ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనుచితమని అన్నారు. ఒకవైపు దేవు ని పూజలు నిర్వహిస్తూ, వేద మంత్రాలు పఠిస్తూండగా.. మరోవైపు సనాతన ధర్మానికి విరుద్ధంగా కోడిగుడ్లతో తయారు చేసిన కేక్ కట్ చేయడం, దీపాలు వెలించాల్సిన పవిత్రమైన చోట కొవ్వొత్తులు వెలిగించడం వంటి చర్యలు అత్యంత హేయమైనవిగా భావిస్తున్నామన్నారు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి, సనాత ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత గల నాయకులే ఇలాంటి చర్యలకు పాల్ప డటం దారుణమన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆలయ కోనేటి వద్ద సంప్రోక్షణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
నేడు సంప్రోక్షణ
స్వామి కోనేటిలో ఆదివారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ధనలక్ష్మి తెలిపారు. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఈ సంప్రోక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


