ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడని వసతులు
● నేటి నుంచి బడుల పునఃప్రారంభం
● తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కరువు
● జిల్లాలో 460 పాఠశాలలు.. 71,780 మంది విద్యార్థులు
శిథిలావస్థలోతరగతి గదులు..
అనేక గ్రామాల్లో పాఠశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి. పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడిన ఘటనలు లేకపోలేదు. తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఉన్న చోట సైతం కొన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి. తాగునీటి వసతి సైతం అంతంత మాత్రంగానే ఉంది. ప్రహరీలు లేని పాఠశాలలు, తరగతి గదుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేయాల్సిన అవసరముంది.
పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్ధులను ప్రత్యేకంగా ఆకర్షించేలా గోడలపై విద్యా సంబంధిత చిత్రాలు, సూక్తులు, రంగురంగుల పెయింటింగ్ వేయించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీకి సైతం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
అలంపూర్/కేటీదొడ్డి/ఇటిక్యాల: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఉన్నత విద్యతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దాదాపు నెలన్నర రోజులపాటు కొనసాగిన వేసవి సెలవులకు స్వస్తి పలికి.. ఆట–పాటల మధుర స్మృతులతో పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటిలాగే అరకొర వసతుల మధ్యే తమ విద్యాభ్యాసం కొనసాగించనున్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో దృష్టిసారించకపోవడంతో చదవుకునేందుకు వచ్చే కొత్త, పాత విద్యార్థులకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ.. సమస్యలు మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు.
అసంపూర్తిగా పనులు..
గతేడాది మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమానికి 142 బడులను ఎంపిక చేసింది. ఆయా పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన అనేక పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు మౌలిక వసతులకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.


