గద్వాల వ్యవసాయం: సంప్రదాయ పంటలకు స్వస్తిచెబుతూ.. సాగులో వినూత్న ఒరవడిని సృష్టిస్తేనే రైతులకు మేలు జరిగి లాభాలు వస్తాయని నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ క్ర మంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పంట మార్పిడిలు చేయాలని, నానో యూరియా వినియోగించాలని, సేంద్రియ పద్ధతులు పాటించాలని వ్యవ సాయ శాఖ గడిచిన నెల రోజుల నుంచి విస్తృతంగా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. ఈసారి రైతులు సాగులో కొంతైనా మార్పులు వస్తాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. అయితే ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4,35,252 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మరి ఈసారి జిల్లాలో పంటల మార్పు ఏ మేరకు జరుగుతుందో వేచిచూడాలి.
పలు అంశాలపై అవగాహన..
రైతులు ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం క్షీణిస్తోంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వాలు పలుమార్లు ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ, ఈసారి వ్యవసాయ శాఖ అధికారులు మే నెలలో రైతులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పథకాన్ని ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో అమలు చేయించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సేద్యం చేయించి పంటలు పండించనున్నారు. ఇందుకోసం ఐదు నెలల క్రితమే జిల్లాలోని ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు క్లస్టర్ల నుంచి, ఒక్కో క్లస్టర్‌కు 125 ఎకరాల చొప్పున మొత్తం 20 వ్యవసాయ క్లస్టర్ల నుంచి 2500 ఎకరాల భూములు, రైతులను ఎంపిక చేశారు. అయితే ప్రకృతి వ్యవసాయ విధాన పద్దతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను కృషి సఖిలుగా నియామకం చేశారు. వీరికి సెంటర్ ఫర్ సస్‌స్టెనబుల్ అగ్రికల్చర్ అనే ఎన్‌జీఓ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతోపాటు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ అందించారు. కృషి సఖిలు ఎంపిక చేసిన పొలాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వారితో వ్యవసాయం చేయించనున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయడం వల్ల దిగుబడులు రావని, పంట మార్పిడి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే యూరియా ఇబ్బందులను అధిగమించేందుకు నానో యూరియా వినియోగించాలని సూచించారు. దీనివల్ల పంట ఎదుగుదల మెరుగుపడటమే కాకుండా.. దిగుబడి సైతం పెరుగుతుందని వివరిస్తున్నారు.
పంట ప్రణాళిక ఖరారు..
వానాకాలం సీజన్‌కు సంబంధించి పంట ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లాలో 3,92,882 ఎకరాల్లో వ్యవసాయ, 42,370 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,35,252 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి, కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. అయితే వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. ప్రస్తుతానికి జిల్లాలో మోస్తరుగా రెండుసార్లు మాత్రమే వర్షాలు వచ్చాయి. దీంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లాలోని బోర్లు, బావులు ఉన్న రైతులు అక్కడక్కడ సాగు పనులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 27,074 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి.
వ్యవసాయంలో మార్పులుతీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు
పంటల మార్పిడి, నానో యూరియాపై అన్నదాతలకు అవగాహన
సేంద్రియ పద్ధతులపై
అధికారుల విస్తృత ప్రచారం
ఈసారి 2,500 ఎకరాల్లో
ప్రకృతి వ్యవసాయానికి చర్యలు
జిల్లాలో ఈసారి 4,35,252 ఎకరాల్లో పంటల సాగు అంచనా
సలహాలు, సూచనలు పాటించాలి
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి సేంద్రియ ఎరువులు, నానో యూరియా ఇలా పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించాం. వాటిని తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది.
– వీరప్ప, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో సాగైన పంటలు ఇలా..
పంట అంచనా ఇప్పటి వరకు
సాగైనవి
పత్తి 2,09,144 26,584
వరి 1,21,941 –
కంది 23,739 450
మొక్కజొన్న 22,982 –
వేరుశనగ 6,396 –
ఇతర పంటలు 8,680 –
ఉద్యానపంటలు 42,370 40


