● వ్యవసాయ పనుల్లో
నిమగ్నమైన అన్నదాతలు
ధరూరు/ అయిజ/ రాజోళి/ ఉండవెల్లి/ అలంపూర్ రూరల్/ మానవపాడు: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ధరూరు మండలంలో శనివారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు గంటపాటు కుండపోత వర్షం కురిసింది. అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటల సాగుకు అనువుగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ పంట సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు పత్తి, ఇతర విత్తనాలు నాటుకునేందుకు ఈ వర్షం అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. అలాగే మానవపాడు మండలంలో శనివారం 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే అలంపూర్ మండల పరిధిలో 41.2 మి.మీ., వర్షపాతం నమోదైందని తహసీల్దార్ ప్రభకర్ వెల్లడించారు. ఉండవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. దీంతో శనివారం రైతులు పంట పొలాల్లో పత్తి విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధిలో జాతీయ రహదారిపై అడ్డుగా పడిన చెట్లను ఎస్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు తొలగించారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లోనూ శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం చినుకులతో మొదలైన వర్షం అక్కడక్కడా మోస్తరుగా కురవడంతో రైతులు సంబరపడ్డారు. అయిజ మండలంలో అత్యల్పంగా 2.4 మి.మీ., వర్షపాతం నమోదయ్యింది.


