గద్వాల: ప్రస్తుతం మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా సాధికారతతో వివక్ష లేని సమాజ నిర్మాణం జరుగుతుందని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల్లో శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని స్నేహ సంఘాల సభ్యులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిసెఫ్ సహకారంతో బాలికల సర్వతోముఖాభివృద్ధికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్నేహ సంఘాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. బాలికలు ప్రజాస్వామ్య వ్యవస్థ, నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల ప్రతిపాదన, ప్రశ్నించడం తదితర విషయాలపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ దోహదపడుతుందన్నారు. స్నేహసంఘాల ద్వారా అమ్మాయిలు తమ గ్రామాల్లోని బాల్యవివాహాలు, నిరక్షరాస్యత వంటి సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు తమవంతుగా కృషి చేయాలన్నారు. అనంతరం బాలికలు మాక్‌పార్లమెంట్ ద్వారా జిల్లాలోని వివిధ సామాజిక సమస్యలను ప్రస్తావించారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల ఏర్పాటు, రవాణా సౌకర్యాల కల్పన తదితర సమస్యలను బాలికలు తెలియజేయగా సంబంధిత అధికారులు స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో యూనిసెఫ్ రాష్ట్ర సమన్వయకర్త మురళి, డీఆర్‌డీఓ ముషాయిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.


