జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం
● మంగళవారం అర్ధరాత్రి తర్వాత
దంచికొట్టిన వర్షం
● అత్యధికంగా కేటిదొడ్డిలో
68.3 మి.మీ., వర్షపాతం నమోదు
● ఆరుతడి పంటల సాగులో
నిమగ్నమైన రైతులు
–8లో u
గట్టు/ ధరూరు/ ఎర్రవల్లి/ : జిల్లాలో వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఇటీవల కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో బుధవారం మొత్తం వాతావరణం పూర్తిగా చల్లబడింది. అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులతో మొదలై.. బుధవారం తెల్లవారుజాము వరకు దాదాపు 3 గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభం కాగా.. ఈ కార్తెలో ఉండే ఎండలకు రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది. అయితే ఇదే రోహిణి కార్తెలో విత్తుకున్న విత్తనాలు మంచిగా మొలకెత్తి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. కార్తె ప్రారంభంలోనే వరుణు కరుణించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 5 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు వర్షాలు కురవడంతో రైతులు వేసవి దుక్కులు ప్రారంభించారు. ఇది వరకే కురిసిన వర్షాలకు పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న రైతులు, ప్రస్తుతం కురిసిన వర్షాలకు విత్తనాలను విత్తుకుంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ పత్తి సాగు చేసే రైతులు తమ పొలాల్లో విత్తనాలు నాటుతున్నారు. సీడ్ పత్తి రైతులు కూడా పొలాలను సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలను నాటుకునే పనిలో పడ్డారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఒక్క మల్దకల్ మండలంలో తప్పా మిగతా అన్నీ చోట్ల దాదాపుగా పూర్తి చేయడంతో అకాల వర్షాల ప్రభావం వాటిపై పడలేదు.
గట్టు మండలం మిట్టదొడ్డి,
చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం మధ్య రోడ్డుపై పడిన చెట్లు
ధరూరు మండలంలోని పారుచర్ల, ధరూరు, మన్నాపురం, గార్లపాడు, సోంపురం, అల్వాలపాడు తదితర గ్రామాల్లో ఊర దేవర ఉత్సవాల్లో నిమగ్నమైన జనం భారీ వర్షం కారణంగా సవారమ్మ ఆలయాల వద్ద ఇబ్బందులకు గురయ్యారు. గాలులకు టెంట్లు, వంట సామగ్రి లేచిపోయింది. ధరూరు ఎస్సీ కాలనీలో కల్లంపల్లి సత్యన్న ఇంటి పైకప్పు కూలింది. ఆ సమయంలో బయట రేకుల షెడ్డు కింద ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఆదుకోవాలని బాధితులు కోరారు.
మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామంలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు కోళ్లఫాం షెడ్ ధ్వంసమైందని బాధితుడు చంద్రకాంత్‌నాయుడు తెలిపారు. కోళ్ల ఫాం షెడ్‌లో ఫ్యాన్లు, రేకులు, పైపులు దెబ్బతిని రూ.3.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


